జిల్లాలో వ్యాక్సినేషన్‌ 97 శాతం పూర్తి
eenadu telugu news
Published : 26/09/2021 03:49 IST

జిల్లాలో వ్యాక్సినేషన్‌ 97 శాతం పూర్తి


రుద్రంగి జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, తదితరులు

సిరిసిల్ల పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో తుదిశలో ఉన్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ త్వరితగతిన వందశాతం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అనురాగ్‌జయంతి వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం అధికారులతో సమీక్షించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జిల్లాలో 97 శాతం పూర్తయిందని, మిగిలింది త్వరితగతిన పూర్తిచేసేలా తగిన చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అధికారులు, ఆరోగ్యకార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది టీకా తీసుకునేలా ప్రోత్సహించిన ఆరోగ్యకార్యకర్తలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్‌ అభినందనలు తెలిపారు. ఇల్లంతకుంట మండల పరిధిలో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. గ్రామాల్లో జ్వరం, డెంగీ కేసులు రాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. డీఎంహెచ్‌ఓ సుమన్‌మోహన్‌రావు, డీపీఓ రవీందర్‌, పంచాయతీరాజ్‌ ఈఈ శ్రీనివాస్‌, సిరిసిల్ల, వేములవాడ ఆసుపత్రుల పర్యవేక్షకులు మురళీధర్‌రావు, మహేష్‌రావు పాల్గొన్నారు.

కొవిడ్‌ టీకాతో ప్రాణాలకు రక్షణ

రుద్రంగి : కొవిడ్‌ టీకాతో ప్రాణ నష్టం గణనీయంగా తగ్గించవచ్చని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో శనివారం అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, డీపీవో రవీందర్‌తో కలిసి పర్యటించారు. మండల పరిషత్తు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో మండలంలో జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను రక్షించాలని ఆదేశించారు. లక్ష్యం మేరకు మొక్కలను నాటడం పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వైద్య సిబ్బంది పని తీరును ఆయన ప్రశంసించారు. అనంతరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వరూపారాణి, జడ్పీటీసీ సభ్యుడు గట్ల మీనయ్య, ఎంపీడీవో శంకర్‌, తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌, ఎంపీవో సుధాకర్‌, మండల వైద్యాధికారి మసూద్‌ అహ్మద్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని