అక్రమ లేఅవుట్లు... కొనుగోలుదార్ల పాట్లు
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

అక్రమ లేఅవుట్లు... కొనుగోలుదార్ల పాట్లు

వేములవాడ పరిధిలో 57 వెంచర్లు

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే

 


ఇటీవల వర్షాలకు లేఅవుట్‌ స్థలాలను ముంచెత్తిన వరద

ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ పట్టణ పరిధిలో స్థిరాస్తి వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. పట్టణం రోజురోజుకు అభివృద్ధి చెందడంతో పట్టణ శివారు ప్రాంతాల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో స్థిరాస్తి వ్యాపారం ఇటీవల జోరుగా సాగుతోంది. ఇదే అదనుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అక్రమ వెంచర్లను ఏర్పాట్లు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు.

వేములవాడ పట్టణ శివారు ప్రాంతాలతో పాటు మున్సిపల్‌ పరిధిలోని తిప్పాపూర్‌, నాంపల్లి, అయ్యోరుపల్లి, శాత్రాజుపల్లి, కోనాయిపల్లి ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు రోజుకో వెంచర్లుగా మారుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే వందల ఎకరాలు వెంచర్లగా మారాయి. అధికారుల కనుసన్నల్లోనే పెద్ద ఎత్తున స్థిరాస్తి వ్యాపారులు అక్రమ వెంచర్లకు తెరతీస్తున్నారు. ఇదంతా కొందరు ప్రజా ప్రతినిధులు, అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖాలు లేవు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే హడావుడిగా హద్దులు తొలగించి మున్సిపల్‌ అధికారులు మమ అనిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేములవాడ మున్సిపల్‌ పరిధిలో స్థిరాస్తి వ్యాపారం పెద్ద ఎత్తున అక్రమంగా కొనసాగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.


రిజిస్ట్రేషన్‌ చేయొద్దని సర్వే నెంబర్ల వివరాలతో సబ్‌రిజిస్ట్రార్‌కు మున్సిపల్‌ అధికారులు రాసిన లేఖ

అధికారులు గుర్తించినవి...

మున్సిపల్‌లోని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు వేములవాడ ప్రాంతంలో 425 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 57 సర్వే నంబర్లలో అక్రమ వెంచర్లున్నట్లు గుర్తించారు. వీటిలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయవద్దని సబ్‌రిజిస్ట్రార్‌కు మున్సిపల్‌ అధికారులు లేఖ అందించారు. అయినా అక్రమ లేఅవుట్లల్లోని ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ ఆగడం లేదు. వ్యవసాయ భూములను లేఅవుట్‌ చేయాలంటే వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేయాలి. లేఅవుట్‌ స్థలంలో సామాజిక అవసరాల కోసం పది శాతం స్థలం కేటాయించడంతోపాటు 33 ఫీట్లు, 40 ఫీట్ల వెడల్పుతో రోడ్లు వేయాల్సి ఉంటుంది. వీటితో పాటు రోడ్లు, విద్యుత్‌, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు కల్పించి అనుమతులు పొంది ప్లాట్లను విక్రయించాల్సి ఉంటుంది. ఇలాంటి వసతులు ఏమీ ఏర్పాటు చేయకుండా ఎలాంటి అనుమతులు పొందకుండానే వందల ఎకరాల్లో వెంచర్లను వేసి ప్లాట్లను ప్రజలకు స్థిరాస్తి వ్యాపారులు అంటగడుతున్నారు. కొందరు స్థిరాస్తి వ్యాపారులు పేపర్లపై నక్ష తీయించి కాగితాలపైనే ప్లాట్లు క్రయ,విక్రయాలు చేస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లోని అక్రమ వెంచర్లలో నీరు నిండి చెరువులు, కుంటలను తలపించాయి. ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నీరు నిండటం చూసి లబోదిబోమన్నారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇంటి నిర్మాణ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్రమ వెంచర్లతో పురపాలక శాఖ పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతున్న అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిబంధనల ప్రకారం చర్యలు

- శ్యామ్‌సుందర్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌, వేములవాడ

మున్సిపల్‌ పరిధిలో అక్రమ వెంచర్లను గుర్తించాం. వాటిలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయొద్దని సబ్‌రిజిస్ట్రార్‌కు లెటరు ఇచ్చాం. అక్రమ వెంచర్లలో చాలా సార్లు హద్దులను తొలగించాం. అక్రమ వెంచర్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని