పూర్వ ప్రాథమిక విద్యకు శ్రీకారం
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

పూర్వ ప్రాథమిక విద్యకు శ్రీకారం

సిరిసిల్ల (విద్యానగర్‌), న్యూస్‌టుడే


అంగన్‌వాడీ కేంద్రాలకు ఇచ్చిన కిట్లు

కరోనా కారణంగా పాఠశాలలు, కళాశాలలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలు గత 18 నెలలుగా మూతపడ్డాయి. పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన జరిగినప్పటికీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఎలాంటి పూర్వ ప్రాథమిక విద్య అందలేదు. డిజిటల్‌ తరగతులు ఉన్నప్పటికీ ఎవరూ వినలేదు. ఇది గమనించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించేందుకు చర్యలు చేపట్టాయి. తాజాగా చదువుకు అవసరమైన పుస్తకాలను, ఆట వస్తువులను, మెడికల్‌ కిట్లను కేంద్రాలకు పంపిణీ చేసింది.

జిల్లాలో మొత్తం 587 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీరందరికీ పూర్వ ప్రాథమిక విద్య అందించడంతో పాటు పోషకాహారం అందించాల్సి ఉంటుంది. తెలుగు, ఆంగ్ల అక్షరాలతో పాటు పదాలు, పద్యాలు, బొమ్మలను గుర్తించేలా చేయడం చేసేవారు. కరోనా కారణంగా కేంద్రాలు మూతపడటంతో వారంతా చదువుకు నోచుకోలేదు. ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రస్తుతం ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి ఒక కిట్టు చొప్పున పంపిణీ చేశారు.

ఇలా నేర్పిస్తారు

చిన్నారులలో విద్యా సామర్థ్యాలను పెంచడం కోసం, ఆటలు ఆడటం, బొమ్మలు గీసేలా కేంద్రాలకు ఐదు రకాల సామగ్రిని పంపిణీ చేశారు. ఎల్‌కేజీ, యూకేజీకి సంబంధించిన పుస్తకాలున్నాయి. కార్డులు, ఆటు ఆడుకునేందుకు కిచెన్‌, గమ్‌సీసాలు, రంగుల పెన్సిళ్లు అందించారు. వీటితో చిన్నారులకు అక్షరాలు నేర్పిస్తారు. పుస్తకాలలో చిన్న చిన్న అంశాలను పొందుపరిచేలా చేస్తారు. చుక్కలను కలుపుతూ బొమ్మలు గీయడం, వస్తువులను గుర్తించడం, అంకెలను రాయడం, పద్యాలను పాడటం వంటివి నేర్పించాల్సి ఉంటుంది. ఇలా విద్యార్థులలో విద్యా సామర్థ్యాలు పెంచి వారి నైపుణ్యతను నమోదు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మెడికల్‌ కిట్లలో ప్రాథమిక చికిత్సకు కావాల్సిన సామగ్రి, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, పారాసెటిమల్‌ తదితర అవసరమైన మెడికల్‌ సామగ్రి ఉన్నాయి.


సద్వినియోగం చేసుకోవాలి

-లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమ అధికారి

చిన్నారులకు మెడికల్‌ కిట్లు ఎంతో ఉపయోగపడతాయి. చిన్నారులకు పూర్వప్రాథమిక విద్యను అందించడం కోసం ఎల్‌కేజీ, యూకేజీ తరహా చదువును కేంద్రాలలో అందించడం జరుగుతోంది. ఇందులో భాగంగా పుస్తకాలతోపాటు కిట్లు వచ్చాయి. కేంద్రాల టీచర్లు ప్రత్యేక శ్రద్ధతో వాటిని సద్వినియోగం చేసుకొని చిన్నారులకు నేర్పించాలి. ప్రస్తుతం వచ్చే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పూర్వ ప్రాథమిక విద్యతో వారికి ప్రయోజనం చేకూరుతుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని