ప్రజా సమస్యలు తీర్చేవరకు పోరాటం ఆగదు
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

ప్రజా సమస్యలు తీర్చేవరకు పోరాటం ఆగదు

పాదయాత్రలో బండి సంజయ్‌


సంజయ్‌కు గజమాలతో స్వాగతం పలుకుతున్న భాజపా నాయకులు, చిత్రంలో మాజీ ఎంపీ విజయశాంతి, భాజయుమో రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్‌ తదితరులు

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: న్యూస్‌టుడే, తంగళ్లపల్లి, ముస్తాబాద్‌: ప్రజలకు న్యాయం జరిగి.. వారి బతుకులు బాగు పడాలనే లక్ష్యంతో తెగించి కొట్లాడుతున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శనివారం 29వ రోజు ఆయన ముస్తాబాద్‌ మండల కేంద్రం నుంచి నడక ప్రారంభించి తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి వరకు 14 కిలోమీటర్ల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా దారి పొడవునా మహిళలు, రైతులు, వృద్ధులు తమ సమస్యలను విన్నవించారు. బైంసా నుంచి వచ్చిన నిరుద్యోగ యువకులు నల్ల కండువాలు ధరించి చేతిలో ప్లకార్డులతో యాత్రలో కలిసివచ్చారు. తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి వద్ద జరిగిన సభలో బండి సంజయ్‌ మాట్లాడారు. కేంద్ర నిధులను దారి మళ్లించి ప్రజలను రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతు బంధు ఇచ్చి మిగతా రాయితీలు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల బాధలు చెప్పుకుంటున్నారని తెలిపారు. పంటల సాగులో కేసీఆర్‌ నిర్లక్ష్య వ్యాఖ్యల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. దశాబ్దం గడుస్తున్నా నేటికి మధ్యమానేరు ముంపు నిర్వాసితులకు పరిహారం అందక.. కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని పేర్కొన్నారు.

రాజన్నకే శఠగోపం

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా రూ.100 కోట్లు ఇస్తామని ఇవ్వకుండా రాజన్నకే శఠగోపం పెట్టిన ఘనుడు కేసీఆర్‌ అని బండి సంజయ్‌ విమర్శించారు. కేసీఆర్‌కు త్యాగాలు చేసిన వారికంటే.. డబ్బులిచ్చే వాళ్లపైనే మక్కువ ఎక్కువన్నారు. నీళ్లలో నుంచి నిధులు.. నిధుల్లో నుంచి కుటుంబాలకు నియామకాలిస్తూ సంబురం చేసుకుంటున్నారని విమర్శించారు. పేదల ఆరోగ్య చికిత్సలకు రూ.5 లక్షల వరకు వ్యయాన్ని కేంద్రమే భరించేలా ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేస్తోంది. కానీ కేసీఆర్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కనపెట్టి పేదల ఉసురుతీస్తోందన్నారు.


పాదయాత్రలో బండి సంజయ్‌తో కలిసి నడుస్తున్న కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల

నిరుద్యోగ భృతిపై నిరసన

యువత, రైతులు తల్చుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని బండి పేర్కొన్నారు. ఉద్యమించేందుకు యువత ముందుకు రావాలని సంజయ్‌ పిలుపునిచ్చారు. మద్యం దుకాణాల రెన్యువల్‌కు ఆఫర్‌ ఇచ్చిన కేసీఆర్‌.. ప్రభుత్వ పథకాలు కావాలంటే మద్యం తాగాలనే స్థాయికి కేసీఆర్‌ దిగజారారని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాల కంటే తొలగించినవే ఎక్కువ ఉన్నాయన్నారు. ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వకపాయే..నిరుద్యోగ భృతి ఏమాయే అంటూ ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతూ సంజయ్‌ నిరుద్యోగ యువకులతో కలిసి ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌లో నల్ల కండువా ధరించి యాత్రలో పాల్గొన్నారు. బీజేవైఎం కార్యకర్తలు కండువాలు ధరించి యాత్రలో ముందుకు సాగారు.

ముస్తాబాద్‌ మండలంలో...

ప్రజా సంగ్రామ యాత్ర ముస్తాబాద్‌ మండలంలోని పోత్గల్‌, గన్నెవారిపల్లె, సేవాలాల్‌తండా మీదుగా శనివారం కొనసాగింది. ముందుగా బస చేసిన శిబిరం వద్ద పండిత్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం యాత్రను కొనసాగించారు. పోత్గల్‌ బస్టాండ్‌ ఆవరణలో చిన్నారులు బండి సంజయ్‌కు ఆటపాటల మధ్య స్వాగతం పలికారు. పలువురు సెల్ఫీలు తీసుకున్నారు. స్థానిక భాజపా నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. నేతాజీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. వర్షం కురుస్తున్నా ప్రాథమిక పాఠశాలకు గొడుగులు పట్టుకొని వెళ్లి చిన్నారులకు జ్యూస్‌ ప్యాకెట్లను అందించారు. పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో పాదయాత్ర సహ ప్రముఖ్‌లు మోహన్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, వీరేందర్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాకాంత్‌, ఎర్రం మహేష్‌, శంకర్‌, నర్సింహ, వెంకట్‌, రాజిరెడ్డి, గోపి, సుభాష్‌ బండ మల్లేశం, ముస్తాబాద్‌ మండల అధ్యక్షుడు కార్తీక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, వెంకటేశ్వర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, రాజు, కోల కృష్ణ, సౌవుల్ల క్రాంతి, సంతోష్‌రెడ్డి, మేర్గు అంజాగౌడ్‌, వంశీ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని