భగీరథ జల వినియోగంపై ఏదీ స్ఫూర్తి!
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

భగీరథ జల వినియోగంపై ఏదీ స్ఫూర్తి!

రెండు అధికారిక సమావేశాలకే పరిమితం

ప్రజా చైతన్యంపై పాలకుల్లో కొరవడిన చిత్తశుద్ధి

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి


2020 డిసెంబరు 31న జడ్పీ సమావేశంలో భగీరథ నీటిని తాగుతున్న ప్రజాప్రతినిధులు

మిషన్‌ భగీరథ నీటి వినియోగంపై అధికార యంత్రాంగంలో చిత్తశుద్ధి కరవైంది. ప్రజలు భగీరథ నీటినే తాగాలని ప్రచారం చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యక్రమాల్లో బహుళజాతి సంస్థల నీటి సీసాలను, ఆర్వో నీటిని వినియోగిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

* గతేడాది డిసెంబరు 31న ఎన్టీపీసీ మిలీనియం హాల్‌లో నిర్వహించిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో అధికార, ప్రజాప్రతినిధులు మినరల్‌(ఆర్వో) నీటికి బదులు శుద్ధి చేసిన మిషన్‌ భగీరథ నీటిని అందించారు. పథకం ఈఈలు పూర్ణచందర్‌, శ్రీనివాస్‌, సిబ్బందితో కలిసి నీళ్ల సీసాకు రూ.5 చొప్పున భరించి అధికారిక సమావేశంలో తొలిసారిగా అందుబాటులో ఉంచారు. ఆ రోజు 300 నీళ్ల సీసాల(దాదాపు 150 లీటర్లు) నీటిని పంపిణీ చేశారు.

* ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర వేడుకలకు 150 లీటర్ల భగీరథ నీటిని వినియోగించారు. ఈ రెండు సందర్భాలు మినహా ఇప్పటివరకు అధికారిక సమావేశంలో మిషన్‌ భగీరథ నీటిని వాడలేదు.

ఆర్వో జలం.. అనారోగ్యకరం

ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు, సమావేశాల్లో తప్పనిసరిగా మిషన్‌ భగీరథ నీటినే అందించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. తద్వారా ప్రజల్లో అవగాహన పెరిగి భగీరథ జల వినియోగం పెరుగుతుందన్నది లక్ష్యం. అయితే క్షేత్ర స్థాయిలో జిల్లా పాలనాధికారి నుంచి అటెండర్‌ వరకు, మంత్రుల నుంచి సర్పంచుల వరకు అందరూ ఆర్వో, మినరల్‌ నీటినే తాగుతున్నారు. భగీరథ నీటిని ఎక్కడా వినియోగించడం లేదు. ఆర్వో నీటి క్యాన్‌కు రూ.15 నుంచి రూ.20 వరకు వెచ్చించి ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఈ నీరు అనారోగ్యకరమని, కీళ్లు, మూత్రపిండ సంబంధిత వ్యాధులు ప్రబలే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


రామగుండం బల్దియా సమావేశంలో కార్పొరేట్‌ కంపెనీల నీటి సీసాలు(పాతచిత్రం)

సురక్షితం సరే.. ఆచరణేదీ!

* లీటరు భగీరథ నీటిలో కాల్షియం, క్లోరైడ్‌, ఐరన్‌, మెగ్నీషియం, నైట్రేట్‌, కాల్షియం కార్బొనేట్‌, లవణాలు 100-120 మి.గ్రా. పరిమాణంలో ఉంటాయి. ఆర్వో ప్లాంటు లీటరు నీటిలో లవణాలు 25 మి.గ్రా.మాత్రమే ఉండటంతో చర్మ, కాలేయ, ఉదర, మూత్రపిండాల వ్యాధులు ప్రబలుతున్నాయి. గ్రామాల్లో ఒక వ్యక్తికి రోజుకు 100 లీటర్లు, పట్టణాల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల వరకు భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు.

* జిల్లావ్యాప్తంగా 436 ఆవాసాలకు మిషన్‌ భగీరథ నీటిని అందిస్తున్నారు. రామగుండం నగరపాలక సంస్థ, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ పురపాలికల పరిధిలో నెలకొల్పిన వందలాది ఆర్వో ప్లాంట్లతో అపరిశుభ్రత తాండవిస్తోంది. క్యాన్లను శుభ్రం చేయకుండానే చెత్త చెదారం, పురుగులు, పాకురుతో కూడిన నీటిని విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.

* సాధారణంగా భూగర్భ జలాన్ని శుద్ధి చేసి క్యాన్‌లలో నింపి విక్రయిస్తుండగా నిర్వాహకులు శుభ్రతను పట్టించుకోవడం లేదు. నాణ్యత ధ్రువీకరించకుండానే అధికారులు అనుమతులు ఇస్తుండటంతో రూ.కోట్లలో నీటి వ్యాపారం జరుగుతోంది.

సీసాల తయారీ యూనిట్‌ లేదు

-శ్రీనివాస్‌, మిషన్‌ భగీరథ ఈఈ

జిల్లాలో సీసాల తయారీ యూనిట్‌ లేదు. ఒకవేళ అందుబాటులో ఉంటే అధికారిక సమావేశాలకు సులభంగా పంపిణీ చేసే వీలుంటుంది. ములుగు జిల్లాలో ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో బాటిళ్ల తయారీ యూనిట్‌ నిర్వహిస్తున్నారు. జిల్లాలో అలాంటి యూనిట్‌ ఉంటే సీసాల్లో భగీరథ నీటి పంపిణీకి మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బహుళజాతి సంస్థల నీళ్ల సీసాలను వినియోగిస్తున్నాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని