నగర ‘పాలన’ ఆగమాగం
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

నగర ‘పాలన’ ఆగమాగం

రామగుండంలో గందరగోళం

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం


అర్ధంతరంగా పనులు ఆగిన ఫెర్టిలైజర్‌ సిటీ ప్రధాన రహదారి

ఠాణాకు చేరిన తుక్కు ఇనుము అక్రమ తరలింపు వ్యవహారం.. తమ అనుమతి లేకుండా టెండర్లు ఓపెన్‌ చేశాడంటూ ఓ అధికారిని సెలవుపై వెళ్లాల్సిందిగా ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు.. మరో అభివృద్ధి పనిని గుత్తేదారుకు కట్టబెట్టడంలో సంబంధిత అధికారి అక్రమాలకు పాల్పడ్డాంటూ విజిలెన్సు అధికారులకు ఫిర్యాదు.. నిర్వహణ గాడి తప్పడంతో పేరుకుపోతున్న చెత్త నిల్వలు.. వాహనాల మరమ్మతులో చేష్టలుడిగిన నగరపాలక అధికారులు.. అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లలో పెరుగుతున్న విభేదాలు.. ఇలా రామగుండం నగరపాలక సంస్థలో నిర్వహణ గాడి తప్పడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

గుట్టుచప్పుడు కాకుండా ఓ ప్రజాప్రతినిధి అండదండ, అధికారులు సహకారంతో అక్రమంగా తరలించిన తుక్కు ఇనుము వ్యవహారం ఇప్పుడు పోలీసుస్టేషన్‌ దాకా వెళ్లడంతో సదరు ప్రజాప్రతినిధితో పాటు అధికారుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. పురపాలక పాత భవనం ఆవరణలో బహుళ ప్రయోజనకర భవన నిర్మాణం కోసం తవ్విన మట్టిని మరో ప్రజాప్రతినిధి అక్రమంగా తరలించుకున్నాడనే ఆరోపణలు వ్యక్తమైనప్పటికీ అధికారగణం పట్టించుకోలేదు. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు అక్రమార్జనకే ప్రాధాన్యతనీయడంతో అభివృద్ధి పనులు అటకెక్కుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్ష కార్పొరేటర్లు తగిన ఆధారాలతో విజిలెన్సు, జిల్లా పాలనాధికారి, పురపాలక నిర్వహణ సంచాలకులు, పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. తుక్కు ఇనుము తరలింపులో అధికారుల ప్రమేయంపై ఆరోపణలు తీవ్రతరం కావడంతో ఎట్టకేలకు సమగ్ర విచారణ జరిపించాలంటూ నగరపాలక అధికారులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేతను అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అడ్డుకోవడంతో పాటు ఆందోళనకు దిగుతుండడం గమనార్హం.


విఠల్‌నగర్‌లో ఆగిన సామాజిక భవన నిర్మాణం

ముందుకుసాగని అభివృద్ధి పనులు

* ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులతో పాటు వివిధ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు అర్ధారంతరంగా ఆగిపోయాయి. గుత్తేదార్లకు బిల్లులు చెల్లించడంలో తీవ్ర జాప్యం నెలకొంటోంది.

* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సమీకృత మార్కెట్‌ భవన నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయి ఏడాది కావస్తున్నా పనులు మొదలుకావడం లేదు.

* నాలుగేళ్ల క్రితం నిర్మించాల్సిన ఇందిరానగర్‌-గౌతమినగర్‌ ప్రధాన రహదారి నిర్మాణం ఇటీవల చేపట్టగా విభాగినులు, కేంద్రీకృత విద్యుత్తు దీపాల ఏర్పాటు పనులు మొదలు కావడం లేదు.

* ఎఫ్‌సీఐ అడ్డరోడ్డు నుంచి ఫెర్టిలైజర్‌ సిటీకి వచ్చే ప్రధాన రహదారిలో ప్రగతినగర్‌ వరకు నగరపాలిక నిధులతో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టినప్పటికీ విస్తరణ, కంకర పోయడంతోనే రోడ్డు పనులు ఆగిపోయాయి.

* పోలీసు స్టేషన్‌ నుంచి లాల్‌బహదూర్‌నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలోని ఓ పాఠశాల వద్ద చినుకు పడిందంటే రోడ్డంతా చెరువులా మారుతుంది. కొద్ది దూరం ఉపరితల మురుగు కాలువను నిర్మించి మాతంగి కాంప్లెక్సు సమీపంలోని ప్రధాన మురుగు కాల్వలో కలిపితే రోడ్డుపై నీరు నిలిచే అవకాశమే ఉండదు. అయినా నగరపాలిక పట్టించుకోవడం లేదు.

* కూరగాయల మార్కెట్‌ పక్కనున్న ప్రధాన మురుగు కాల్వ రెండు చోట్ల కూలిపోయి ప్రమాదకరంగా మారగా మరో రెండు చోట్ల కూలేందుకు సిద్ధంగా ఉన్నా మరమ్మతులు చేపట్టడంలో అధికారులు శ్రద్ధ కనబరచడం లేదు.

* తాగునీటి పైపులైన్లు, భూగర్భ మురుగు కాల్వలు లీకేజీలతో వివిధ కాలనీల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.


మౌలిక వసతులపై నిర్లక్ష్యం

* ప్రధాన మురుగు కాలువల్లో పూడికతీత పేరిట ఏడాదికోమారు సుమారు రూ.50 లక్షలకు పైగా ఒకే గుత్తేదారుకు వివిధ పేర్లతో పనులు అప్పగిస్తున్న బల్దియా ఆయా పనులను పర్యవేక్షించడం లేదు.

* పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చాలనే లక్ష్యంతో కొనుగోలు చేసిన అత్యాధునిక వాహనాలు, ఆటో ట్రాలీలు తరచూ మొరాయిస్తుండడంతో ఆశించిన లక్ష్యం నెరవేరకపోగా పారిశుద్ధ్య నిర్వహణ అటకెక్కింది.

* వాహనాల నిర్వహణను ‘టీఎస్‌ ఆగ్రోస్‌’ సంస్థకు అప్పగించినప్పటికీ అగ్రిమెంటు చేసుకోవడంలో ఇరుపక్షాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. వాహనాలు ఒక్కొక్కటిగా చెడిపోతూ మూలన పడుతున్నాయి.

* ఇటీవల లాల్‌బహదూర్‌నగర్‌లో ఒకే రోజున కొద్ది గంటల్లోనే ఐదుగురు పిల్లలను కుక్కలు తీవ్రస్థాయిలో గాయపర్చాయి. డివిజన్‌ కార్పొరేటర్‌ ఐత శివకుమార్‌ నగరపాలక కార్యాలయం ముందు అదే రోజు రాత్రి నిరసన ప్రదర్శన చేయడంతో మరునాటి నుంచి కుక్కల తరలింపు చేపడుతామని హామీ ఇచ్చిన అధికారులు ఆచరణలో పెట్టడం లేదు.

* పక్షం రోజుల్లో పందుల తరలిస్తామన్న పెంపకందారులు.. తమకు జీవనాధారమైన పందులను అక్రమంగా తరలించవద్దంటూ పెంపకందారులు కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం గమనార్హం.

* రామగుండం, యైటింక్లయిన్‌ కాలనీతో పాటు వివిధ ప్రాంతాల్లో కోతుల బెడద సైతం తీవ్రంగానే ఉంది. ఇళ్లల్లోకి చొరబడి ఇంట్లోని వస్తువులను చిందరవందర చేస్తుండడంతో పాటు అడ్డు వచ్చిన వారిని కరుస్తున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని