కాలితే.. మోసుకురావాల్సిందే!
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

కాలితే.. మోసుకురావాల్సిందే!

పొలాల మధ్య నియంత్రికలతో రైతులకు అవస్థలు

సారంగాపూర్‌, న్యూస్‌టుడే

 


నియంత్రికను కర్రలకు కట్టుకుని తీసుకొస్తున్న రైతులు(పాత చిత్రం)

లోవోల్టేజీ నివారణకు పంట పొలాల్లో ఏర్పాటు చేసిన నియంత్రికలతో రైతులు అవస్థలు పడాల్సి వస్తుంది. గతంలో ప్రతి 50 నుంచి 70 మోటార్లకు కలిపి ఒకే చోట 100 హెచ్‌పీ సామర్థ్యం గల నియంత్రికలు రహదారి పక్కనే ఉండేవి. ఒకే నియంత్రికపై పదుల సంఖ్యలో విద్యుత్తు మోటార్లు ఉండడంతో చివరన ఉన్న రైతుల విద్యుత్తు మోటార్లకు తరచూ లోవోల్టేజీ సమస్య ఏర్పడి కాలిపోతుండేవి.

రైతుల ఇబ్బందులను గుర్తించి పైలెట్‌ ప్రాజెక్టు కింద రైతుల విద్యుత్తు మోటార్లపై భారం పడకుండా హెచ్‌వీడీఎస్‌(హైవోల్టేజీ డిస్టూబ్యూట్‌ సిస్టం) కింద పలు మండలాలను ఎంపిక చేశారు. దీని ద్వారా ప్రతి మూడు నుంచి అయిదు మోటార్లకు కలిపి ఒక చోట 16 హెచ్‌పీ, 25హెచ్‌పీ సామర్థ్యం విద్యుత్తు నియంత్రికలను ఏర్పాటు చేయడంతో లోవోల్టేజీ తగ్గి విద్యుత్తు మోటార్లు కాలిపోకుండా ఉండేందుకు అమర్చారు. అయితే ప్రతి మూడు నుంచి అయిదు మోటార్లకు ఒక్క నియంత్రిక ఏర్పాటు చేయాల్సి రావడంతో ఎక్కడ పడితే అక్కడే ఉంచారు. దీనివల్ల ప్రతి నియంత్రిక పొలాల మద్య రావడంతో వరినాట్లు వేసిన తరువాత నియంత్రిక కాలిపోతే అక్కడి నుంచి రహదారికి తీసుకురావాలంటే నానావస్థలు పడాల్సి వస్తుంది.


పొలాల మధ్య నియంత్రిక

పిడుగులతోనే నష్టం..

జిల్లాలో సారంగాపూర్‌, కల్లెడ, అల్లీపూర్‌, కొడిమ్యాల, తిమ్మాపూర్‌, కోరుట్ల గ్రామీణంతోపాటు పలు ఉప కేంద్రాల పరిధిలో పైలెట్‌ ప్రాజెక్టు కింద తీసుకున్నారు. సారంగాపూర్‌ మండల పరిధిలో 1062 నియంత్రికలు ఉండగా ఇందులో 600లకు పైగా నియంత్రికలు పొలాల మధ్యలో ఉండగా జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నాయి. నియంత్రికలు బిగించే సమయంలో సరైన ఎర్తింగ్‌ ఇవ్వకపోవడంతో పిడుగులు పడ్డప్పుడు ఎక్కువగా ఖాళీ పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో నియంత్రిక కాలిపోయిన సమయంలో కర్రలకు కట్టుకుని ఎత్తుకుని రావాల్సి వస్తుంది. దీని ద్వారా పంట పొలాలు పాడవ్వడమే కాకుండా కూలీలకు రూ.3 నుంచి 6వేల వరకు చెల్లించాల్సి వస్తుండగా, నియంత్రిక మరమ్మతులకు అదనంగా వ్యయం చేయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం రహదారికి దగ్గరంగా ఉన్న నియంత్రికలను పొలాల నుంచి బయటకు తీసుకొచ్చి ఏర్పాటు చేసేలా చూడాలని రైతులు వేడుకుంటున్నారు.


సమస్య ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది

- రవినాయక్‌, ట్రాన్స్‌కో ఏఈ

రైతుల సమస్య ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. గతంలో వీలైన నియంత్రికలను రహదారి వెంట వేసేలా చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం అధికారులు ఆదేశిస్తే పొలాల్లోని నియంత్రికలను రహదారి వెంట వేసేలా చూస్తాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని