అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం


సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: నగరంలో చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయని, వర్షం నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ, సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించారు. శనివారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో స్మార్ట్‌సిటీ పనుల ప్రగతిపై నగరపాలక, ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్‌అండ్‌బీ రహదారులకు ఇరువైపులా ఉన్న కాల్వలు తనిఖీ చేయాలన్నారు. వర్షం పడితే చాలు నీరంతా రోడ్లపైకి ఎందుకు వస్తుందని ఆగ్రహించారు. నగరంలో చేపడుతున్న స్మార్ట్‌సిటీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని కోరారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేయకుండా ప్రజలు నడిచి వెళ్లే విధంగా ఆక్రమణలు తొలగించాలని, రోడ్లపై కూరగాయలు విక్రయించకుండా రైతులు, వ్యాపారులు కూరగాయల మార్కెట్‌లో విక్రయించుకునేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. డంపింగ్‌యార్డు పనులు త్వరగా చేయాలని, స్మార్ట్‌సిటీ, ఆర్‌అండ్‌బీ, నగరపాలక ఇంజినీర్లు సమన్వయంతో పని చేయాలన్నారు. టవర్‌సర్కిల్‌ ప్రాంతంలో స్మార్ట్‌సిటీ పనులు వేగంగా చేపట్టాలని, సమీకృత మార్కెట్ల నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. మేయర్‌ వై.సునీల్‌రావు మాట్లాడుతూ.. స్మార్ట్‌సిటీ పనుల్లో కాంట్రాక్టర్లు అలసత్వం ప్రదర్శించకుండా పనులు వేగంగా చేయాలన్నారు. రోడ్లపై నీరు నిల్వకుండా ఫుట్‌పాత్‌ల కింద గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. మల్కాపూర్‌ రోడ్డు, పద్మనగర్‌ రోడ్లపై ఇరువైపులా నాలాలు నిర్మించాలన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో సీపీ వి.సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమ అగ్రవాల్‌, కమిషనర్‌ యాదగిరిరావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణిహరిశంకర్‌, ఎస్‌ఈ కృష్ణారావు, ఈఈ రామన్‌, డీసీపీ సుభాష్‌ తదితరులు ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని