అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

భూగర్భ గనుల శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: గ్రానైట్‌, ఇసుక రీచ్‌లతో ప్రభుత్వానికి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. కరీంనగర్‌ జిల్లా అంటేనే గ్రానైట్‌ క్వారీలు, కటింగ్‌ పరిశ్రమలకు ప్రసిద్ధి. స్థానిక అవసరాల కోసం జిల్లాలో 20 రీచ్‌లను గుర్తించారు. అయినా కూడా ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. క్వారీలు, ఇసుక రీచ్‌ల్లో అక్రమాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలు, ఇతర అంశాలపై భూగర్భ గనుల శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ ‘న్యూస్‌టుడే’తో జరిగిన ముఖాముఖీలో వివరాలు వెల్లడించారు.

న్యూస్‌టుడే: స్థానిక అవసరాలకు ఇసుక అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇసుక రీచ్‌లను గుర్తించారు. అయినా అందడం లేదు. అక్రమ రవాణా ఆగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.

ఏడీ: జిల్లాలో 20 శాండ్‌టాక్స్‌ రీచ్‌లను గుర్తించాం. ప్రస్తుతం వాటిలో నీరు చేరడం వల్ల అందుబాటులో లేవు. ఇసుక అవసరాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపడుతున్నాం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. ఇందుకోసం పోలీసు, రెవెన్యూ శాఖల సహకారం తీసుకుంటున్నాం. త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం.

న్యూ: భూగర్భగనుల శాఖ పర్యవేక్షణ లోపంతో కొన్ని పరిశ్రమల యజమానులు రాయల్టీ చెల్లించకుండానే తక్కువ గ్రానైఫట్‌ను తయారు చేసినట్లు చూపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏమైనా కేసులు నమోదు చేశారా?

ఏడీ: జిల్లాలో 225కు పైగా గ్రానైట్‌ కటింగ్‌ పరిశ్రమలు ఉన్నాయి. నిరంతరం తనిఖీలు చేస్తున్నాం. అక్రమాలు జరిగినట్లు తేలితే జరిమానా కూడా విధిస్తున్నాం. ఓ పరిశ్రమకు రూ.48 వేల జరిమానా వేశాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తాం.

న్యూ: జిల్లా గనుల శాఖ కార్యాలయంలో క్వారీలు, కటింగ్‌ పరిశ్రమల యజమానులకు అనేక పనులు ఉంటాయి. నిజామాబాద్‌లో ఏడీగా పోస్టింగ్‌ ఉండి కరీంనగర్‌లో ఏడీ (ఇన్‌ఛార్జి)గా విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఏజీ కూడా ములుగులో ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సకాలంలో పనులు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఏడీ: ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇక్కడ ఇన్‌ఛార్జి ఏడీగా వ్యవహరిస్తున్నాను. ఏజీ (అసిస్టెంట్‌ జువాలజిస్ట్‌) కూడా కరీంనగర్‌లో పోస్టింగ్‌ ఉండి ములుగులో విధులు నిర్వహిస్తున్నారు. సమన్వయం చేసుకుంటూ క్వారీల, పరిశ్రమల యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం. వారంలో రెండు రోజులు ఇక్కడే ఉంటున్నాను. అవసరాన్ని బట్టి వారంలో మరిన్ని రోజులు వస్తున్నాను.

న్యూ : క్వారీలను లీజు తీసుకొని వాటిని సబ్‌ లీజుకు ఇస్తున్నారు. రద్దు చేసి మరొకరికి కేటాయించే అవకాశం ఉందా?

ఏడీ: జిల్లాలో 297 క్వారీలు ఉన్నాయి. ఇందులో 60 నుంచి 90వరకు నడుస్తున్నాయి. లీజులు తీసుకొని నడపని క్వారీల విషయంలో ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకుంటాం. నోటీసులు ఇవ్వడంతో పాటు కారణాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని