రిజిస్ట్రేషన్లు తగ్గి.. ఆదాయం పెరిగి..
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

రిజిస్ట్రేషన్లు తగ్గి.. ఆదాయం పెరిగి..

న్యూస్‌టుడే-రాంపూర్‌

 


కరీంనగర్‌లోని జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయం

రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినా ప్రభుత్వానికి సమకూరే ఆదాయం మాత్రం పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది జులై 22 నుంచి వ్యవసాయేతర భూముల ఆస్తుల మార్కెట్‌ విలువను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పెంచి అమలు చేస్తోంది. ముందుగానే ఈ విషయం తెలిసి పెద్దసంఖ్యలో స్థిరాస్తుల క్రయ, విక్రయాలు జరిగాయి. విలువ పెంపునకు ముందు గల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల సంఖ్యకు చేరుకోవడం లేదు. మరో వైపు వ్యవసాయేతర భూముల ధరలు కూడా పెరగడంతో కొంత మేరకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గుముఖం పట్టింది. మార్కెట్‌ విలువ పెంపునకు ముందు కరీంనగర్‌ జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖకు కేవలం వ్యవసాయేతర భూముల ఆస్తుల క్రయ, విక్రయాలతో నెలకు రూ. 2 నుంచి రూ.3కోట్ల ఆదాయం సమకూరేది. ప్రస్తుతం రూ.4 కోట్లకు దాటడం విశేషం. జిల్లాలో కరీంనగర్‌, తిమ్మాపూర్‌, గంగాధర, హుజూరాబాద్‌లలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. ప్రధానంగా కరీంనగర్‌, గంగాధర సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతుంటాయి. కరీంనగర్‌, కరీంనగర్‌ సమీపంలోని శివారు గ్రామాలు వీటి పరిధిలోనే ఉండటంతో స్థిరాస్తుల క్రయ, విక్రయాలు ఈప్రాంతాల్లో జోరుగా సాగుతుంటాయి. మార్కెట్‌ విలువల పెంపునకు ముందు కరీంనగర్‌ జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఒక్క వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లు ప్రతి నెలా 4వేలకు పైగా జరిగాయి. విలువల పెంపుతో జులై చివరి వారంతో పాటు ఆగస్టు మొదటి వారం వరకు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు మందగించాయి. మరో వైపు భూముల ధరలు పెరగడంతో కూడా కొనుగోలు దారులు ఈవిషయంలో కొంత సందిగ్ధంలో నిలిచారు. క్రమంగా మార్పు వస్తున్నప్పటికీ అంతకు ముందు గల రిజిస్ట్రేషన్ల సంఖ్యకు చేరుకోలేదు. ఈ నెలలో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రూ.కోటికి చేరుకోలేకపోయింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని