అన్నివర్గాల ప్రజల ఆశీస్సులు తెరాసకే!
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

అన్నివర్గాల ప్రజల ఆశీస్సులు తెరాసకే!

రెడ్డి ఆత్మీయ సమ్మేళన సభలో మంత్రి హరీశ్‌

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌, న్యూస్‌టుడే- జమ్మికుంట, హుజూరాబాద్‌

హుజూరాబాద్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ భవనానికి భూమిపూజచేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన స్పీకర్‌ పోచారం, మంత్రులు సబిత, నిరంజన్‌ రెడ్డి, హరీశ్‌, గంగుల, తెరాస నేతలు కౌశిక్‌రెడ్డి, పెద్దిరెడ్డి

న్నివర్గాల ప్రజల ఆశీస్సులు తెరాసకే ఉన్నాయని, తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం జమ్మికుంటలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్వహించిన రెడ్ల ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రైతు సంక్షేమానికి పాటుపడుతూ 24 గంటలపాటు ఉచిత విద్యుత్తును ఇస్తున్న ప్రభుత్వం తమదైతే.. అదే రైతుల బోర్ల వద్ద విద్యుత్తు మీటర్లను పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని భాజపా వైఖరిని తప్పుబట్టారు. బొట్టుబిల్లలు చేతులో పెట్టేవారిని చూసి మోసపోవద్దని చెప్పారు.వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఏ ఒక్క గ్రామానికి అభివృద్ధి, సంక్షేమం దరిచేరలేదని తీర్మానాలతో నిరూపించగలరా..? అని పాదయాత్రలు, సభలు పెడుతున్న ప్రతిపక్షపార్టీలను విమర్శించారు. చెల్లినోడు, చెల్లనోడు చిల్లరమాటలు మాట్లాడుతున్నారని అభివృద్ధి సహా రైతు సంక్షేమం, ఏ రంగంలోనైనా తెలంగాణకు పోటీపడే రాష్ట్రం దేశంలో మరేదైనా ఉంటే చూపిస్తారా..? అని సవాలు విసిరారు. ఒక్క లక్ష ఎకరాలకు నీరందించే జూరాల ప్రాజెక్ట్‌ను 40 ఏళ్లపాటు గత పాలకులు కట్టారని, అదే కేసీఆర్‌ 45లక్షల ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరాన్ని మూడేళ్లల్లో పూర్తిచేశాడని చెప్పారు. కేసీఆర్‌ను రాక్షసుడని, దుర్మార్గుడని తిట్టడం సరైనది కాదని ఈటల వైఖరిని తప్పుబట్టారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమం గురించే సీఎం కేసీఆర్‌ అనుక్షణం ఆలోచిస్తారని, ఎవరు ఏది అడుగకున్నా వారి మనస్సుని తెలుసుకుని పాలన అందిస్తున్నారన్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగభర్తీలను చేపట్టాలని, ఓసీలకు 10శాతం రిజర్వేషన్‌ను అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశానికి ముందు హుజూరాబాద్‌లో వీరంతా రెడ్డి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ భవనానికి భూమిపూజచేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, తెరాస నాయకులు కౌశిక్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎమ్మెల్యేలు పెద్దిసుదర్శన్‌రెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌ పాల్గొన్నారు.

జమ్మికుంట సమావేశానికి హాజరైన ప్రజలు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని