కాల్వల నిండా పూడిక
eenadu telugu news
Published : 19/10/2021 04:55 IST

కాల్వల నిండా పూడిక

మురుగు ప్రవాహానికి అడ్డంకులు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

ఆమేర్‌నగర్‌లో అధ్వానంగా మురుగునీటి కాల్వ

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాకాలం ప్రారంభంలో ముందస్తుగా వరదకాల్వల్లోని పూడికను తొలగిస్తుండగా ప్రధాన, అంతర్గత రహదారుల్లోని డ్రైనేజీల్లోని మట్టి, చెత్తా చెదారం మాత్రం తొలగించడం లేదు. అందులోనే పేరుకుపోవడంతో మురుగునీరు కాల్వలు నిండి ప్రవహిస్తోంది. ఓ వైపు స్వచ్ఛత వైపు పరుగులు పెడుతున్న నగరానికి.. మరోవైపు క్షేత్రస్థాయిలో మురుగు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. శివారు ప్రాంతాలతో పాటు విలీన కాలనీల్లో ఇలాంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. నీరు నిలిచి ఉండటంతో దోమలకు స్థావరంగా మారుతుంది. ముఖ్యంగా రహదారులు, భవనాల శాఖకు చెందిన రహదారులకు ఇరువైపులా ఉన్న డ్రైనేజీలు అయితే భయంకరంగా మారాయి. అందులోంచి మురుగు సాఫీగా ప్రవహించే అవకాశముండదు. కాల్వలు నిండితే తప్ప కదలని పరిస్థితి నెలకొని ఉంది. అదేవిధంగా స్మార్ట్‌సిటీలో భాగంగా నిర్మిస్తున్న కాల్వలు అలాగే ఉంటున్నాయి. శ్లాబులు వేసే ముందు వాటిని శుభ్రం చేయాల్సి ఉండగా చేయడం లేదు. ఇటీవల విద్యానగర్‌, ఆదర్శనగర్‌లో డ్రైనేజీ నుంచి నీరు వెళ్లకపోవడంతో కార్మికులను దింపి సలాకలు, చెక్కలు, రాళ్లు తొలగించారు.

కోతిరాంపూర్‌ ప్రధాన రహదారి పక్కన డ్రైనేజీ

శివారులో..
శివారు డివిజన్లలో, విలీన గ్రామాల్లోని కాలనీల్లో కచ్చా కాల్వలు అస్తవ్యస్తంగా మారాయి. పందులు సంచరిస్తుండటంతో ఆ కాల్వలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. మురుగు సక్రమంగా ప్రవహించకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. విలీన కాలనీల్లో కార్మికులు ఉన్నప్పటికీ వారంతా నామమాత్ర విధులకు పరిమితం అవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.

కార్మికులున్నా పనులేవీ?
డివిజన్‌కు పదకొండు మంది కార్మికులు ఉన్నట్లు లెక్కలు చూపుతున్నా ఎక్కడ ఎంత మంది పని చేస్తున్నారో తెలియని గందరగోళం నెలకొంది. ఏ వీధికి ఎన్ని రోజులకు ఒకసారి కాల్వలు శుభ్రం చేయడానికి వస్తున్నారనే విషయం తెలియడం లేదు. వీధులను ఊడవటం, కాల్వలు శుభ్రం చేయడంలో ఈ మధ్య జాప్యం చేస్తున్నారు. కార్మికులను ఇతర అవసరాలకు వినియోగిస్తుండటంతో డ్రైనేజీల శుభ్రతపై ప్రభావం పడుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇంజినీరింగ్‌ అధికారులకు ఆదేశాలు
- బి.రాజమనోహర్‌, పారిశుద్ధ్య పర్యవేక్షకుడు
ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఉన్న డ్రైనేజీల్లోని పూడికను తొలగించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులకు సమాచారం ఇవ్వాలని గత కమిషనర్‌ క్రాంతి ఆదేశాలు ఇచ్చారు. పైకప్పు తొలగించి శుభ్రం చేయించాల్సి ఉంది. మిగతా డివిజన్లలో పనులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని