సమయం లేదు మిత్రమా!
eenadu telugu news
Published : 19/10/2021 04:53 IST

సమయం లేదు మిత్రమా!

రోడ్డు షోలకే ప్రాధాన్యం

ప్రచార సందడిలో మూడు పార్టీలు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

మూడు పార్టీలు ముప్పేట దాడి అనేలా హుజూరాబాద్‌లో  ప్రచార సమరం సాగుతోంది.  పోటాపోటీగా తెరాస, భాజపా, కాంగ్రెస్‌ శ్రేణులు నలువైపులా పర్యటిస్తూ ఓటర్ల మన్ననల్ని పొందే ప్రయత్నాల్ని చేస్తున్నాయి. సమయం తక్కువగా ఉండడం... ఉప ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో ముఖ్యనేతల కార్యక్రమాల్ని ఇక్కడి నియోజవర్గంలో విరివిగా ఏర్పాటు చేస్తూ అభ్యర్థులు ఓటు వేటలో నిమగ్నమవుతున్నారు. రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలకు తగినట్లుగా వైరిపక్షాలపై ఎదురుదాడులను మాటల రూపంలో కొనసాగిస్తున్నారు. ఎవరికి వారుగా ఇస్తున్న హామీలను ప్రస్తావిస్తూనే.. ప్రత్యర్థుల తీరుల్ని తప్పుబట్టేలా ఓటర్ల చెంతన మాటల దాటిని అభ్యర్థులు, వారి తరపున ముఖ్యనేతలు ఇంతకింతకు పెంచుతున్నారు. ఉన్న కాస్త సమయాన్ని సద్వినియోగపర్చుకునేలా ఊరువాడల్లోని చౌరస్తాల్లో సమావేశాల నిర్వహణతో ముందుకు సాగుతున్నారు.

ఎక్కవ సమావేశాలే..!
ఇంటింటి ప్రచారానికి అభ్యర్థులు వెళ్లి ఓట్లు అడిగేంత వ్యవధి లేకపోవడంతో మూడు పార్టీల అభ్యర్థులు ప్రతి రోజు ఐదారు ఊళ్లల్లో రోడ్‌షోలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రజలందరినీ గుమిగూడేలా పార్టీ శ్రేణులు అక్కడి వాతావరణాన్ని ముందుగానే సిద్ధం చేస్తున్నారు. డప్పుచప్పుళ్లతో, కోలాటాలతో ఘన స్వాగతం పలుకుతూ తమ అభ్యర్థికి ఉన్న పట్టుని ప్రజానీకానికి తెలియజెప్పే ప్రయత్నాల్ని చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాలను ఇప్పటికే తెరాస, భాజపా అభ్యర్థులు దాదాపుగా చుట్టివచ్చిన సందర్భాలున్నాయి. ఆలస్యంగా ప్రచారానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఈ ఉన్న సమయంలోనే అన్ని ఊళ్లల్లో ప్రచారాన్ని సాగించాలనే తపనతో రోజూవారీ పర్యటనల్ని ఎక్కువగా షెడ్యూల్‌ చేసుకున్నారు.   గడపగడపకు వెళ్లే అవకాశం లేకపోవడంతో సమావేశాలు, రోడ్‌షోల నిర్వహణకే మూడు పార్టీల అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు.

ఎత్తుగడలతో ముందుకు..
తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని ఓట్ల రూపంలో పొందేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తుగడలతో రహస్య వ్యవహారాల్ని కొన్నిచోట్ల చూపించబోతున్నారు. అధికంగా ఓట్లు ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకుని వారి బంధుగణంతో మాట్లాడించేలా ప్రయత్నాల్ని సల్పుతున్నారు. ఇందుకోసం ఆయా పార్టీలు ప్రత్యేకంగా కొందరిని నియమించి వారి పర్యవేక్షణలో ఓట్లకు గాలం వేసే చర్యలను చక్కబెడుతున్నారు. ఎదుటి పార్టీని ఎలా బోల్తా కొట్టించాలనే తీరులో ఊహించని తరహాలో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థుల దాటిని తట్టుకుని తాము సంపాదించే ఓట్ల విషయమై ఇప్పటికే అంచనా వేసుకుంటున్నారు. విజయాన్ని అందుకోవాలంటే ఇంకా ఎలా వ్యవహరించాలనేలా పార్టీ ముఖ్యులతో సమాలోచనల్ని చేస్తూ లెక్కలేసుకుంటున్నారు.  ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రత్యర్థిపై పై చేయి సాధించాలనే జోరుని పలురకాలుగా చూపించేందుకు సిద్ధమవుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని