ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ
eenadu telugu news
Published : 19/10/2021 04:53 IST

ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ

మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల (విద్యానగర్‌), న్యూస్‌టుడే: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు. జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశమందిరంలో వానాకాలం 2021-22కి సంబంధించి ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత వానాకాలంలో 1,76,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామని, ఈ వానాకాలం  3,50,000 మెట్రిక్‌ టన్నులు సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. క్వింటాల్‌కు ‘ఏ’-గ్రేడ్‌ రకానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940లను ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించిందన్నారు. రైతులకు ధాన్యం అమ్మడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ వానాకాలంలో జిల్లాలోని ప్రతీ పంచాయతీకి ఒక కొనుగోలు కేంద్రం ఉండేలా దాదాపు 263 ధాన్యం కొనుగోలు కేంద్రాలు (ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, మెప్మా, ఏఎంసీల ద్వారా) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయన్నారు. రెండు, మూడు రోజులలోపు పంచాయతీల వారీగా వరి కోతలు ప్రారంభమైన గ్రామాల వివరాల రిపోర్ట్‌ సమర్పించాలని పేర్కొన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతులకు టోకెన్లు జారీ చేసేలా చూడాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారిని ఆదేశించారు. కొనుగోళ్ల ప్రారంభానికి ముందే అవసరమైన మాయిశ్చర్‌ మీటర్లు, ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలు, టార్పాలిన్లు కొనుగోలు చేసి అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా మార్కెటింగ్‌ అధికారికి సూచించారు. ధాన్యం సేకరణకు దాదాపు కోటి గన్నీ సంచులు అవసరముంటాయని, ముందుగానే వీటిని సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. చౌకధరల దుకాణాదారులు, రైస్‌ మిల్లుల నుంచి గన్నీ సంచులను సేకరించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి, మేనేజర్లను ఆదేశించారు. ధాన్యం రవాణాకు లారీల కొరత లేకుండా గుత్తేదారులతో ఒప్పందం చేసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీసీఎస్‌వో జితేందర్‌రెడ్డి, డీఎంసీఎస్‌ హరికృష్ణ, డీఆర్‌డీవో కౌటిల్యరెడ్డి, డీఏవో రణధీర్‌రెడ్డి, డీసీవో బుద్ధనాయుడు, డీఎంవో ప్రవీణ్‌కుమార్‌, డీటీవో కొండల్‌రావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని