ఆస్తులు పంచలేదని.. ‘ఆటోమేటిక్‌’గా కొట్టేసింది
eenadu telugu news
Updated : 19/10/2021 12:23 IST

ఆస్తులు పంచలేదని.. ‘ఆటోమేటిక్‌’గా కొట్టేసింది

విలువైన వస్తువులు, పత్రాలు తస్కరించిన కోడలు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, నారాయణగూడ: ఉమ్మడి కుటుంబంలో సంసార బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ కోడలు.. విలువైన వస్తువులు.. పత్రాలు దొంగిలించాలని పథకం వేసింది. తనపై ఏమాత్రం అనుమానం రాకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించింది. దసరా పండక్కి అత్తమామలు హైదరాబాద్‌కు వెళ్లగానే తన పనిపూర్తి చేసింది. పండుగ పూర్తి చేసుకుని అత్తమామలు ఇంటికి వచ్చి బీరువాలు, అల్మారాలను పరిశీలించగా... విలువైన వస్తువులు, పత్రాలు లేవు. ఇంటి దొంగలపై హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడికి అనుమానం వచ్చి సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మామ ఫోన్‌ను పరిశీలించారు. అతడి ఫోన్‌లో ఓ మొబైల్‌యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి దాని ద్వారా కోడలే ఇదంతా చేసిందని పోలీసులు గుర్తించారు. కరీంనగర్‌లో జరిగిన ఈ సాంకేతిక నేరం వివరాలను సోమవారం నగరంలో సైబర్‌క్రైమ్‌ పోలీసు అధికారులు వెల్లడించారు.

ఉమ్మడి కుటుంబంలో ఉండలేనని..
కరీంనగర్‌లో ఉంటున్న వైకుంఠం (71)కు నలుగురు కుమారులున్నారు. తనవద్ద ఇద్దరు కుమారులు, కోడళ్లు ఉండగా... మరో ఇద్దరు కుమారులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉండలేమని ఓ కోడలు కొద్దినెలలుగా తరచూ అత్తమామలతో గొడవపడుతుండేది. తమ తదనంతరమే ఆస్తి పంపకాలంటూ అత్తమామలు తెగేసి చెప్పడంతో ఆమె అసంతృప్తితో సంసార బాధ్యతలు నిర్వహిస్తోంది. పండుగలు, పబ్బాలప్పుడు కనీసం బంగారు నగలైనా ఇవ్వాలంటూ కోరేది. అత్తమామలు వినకపోవడంతో పండుగరోజు సూటిపోటి మాటలతో వృద్ధులను వేధిస్తుండేది. అత్తమామలకు బాధగా ఉన్నా. పట్టించుకోకుండా ఇంట్లోనే ఉంటున్నారు.

మామ ఫోన్‌కు ఆటోమేటిక్‌ కాల్‌ రికార్డింగ్‌..
అత్తామామలపై కోపంతో ఉన్న కోడలు.. ఇంట్లోని దేవుడిగది, బీరువాలో దాచిన బంగారు ఆభరణాలు, ఆస్తిపత్రాలు  దొంగిలించాలని పథకం వేసింది. మూడునెలల క్రితం మామ ఫోన్‌లో ఆటోమేటిక్‌ కాల్‌ రికార్డింగ్‌యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి... తన గూగుల్‌డ్రైవ్‌కు అనుసంధానం చేసింది. అప్పటి నుంచి తనమామ ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ వినడం ప్రారంభించింది. తన గురించి ఎవరికైనా చెబితే ఆ మాటల ఆధారంగా వారిని వేధించేది. దసరా పండుగకు బేగంపేటలో ఉన్న కుమారుడు రమ్మని వైకుంఠాన్ని పిలిచాడు. వచ్చేప్పుడు బీరువా, అల్మారా, దేవుడి గది తాళాలు తీసుకురావద్దని, ఇంట్లోనే భద్రపరిచి రావాలంటూ చెప్పాడు. దీంతో వైకుంఠం.. తాళాలను ఎక్కడ ఉంచింది కుమారుడికి వివరంగా చెప్పాడు. వీటిని విన్న కోడలు.. అత్తమామలు హైదరాబాద్‌కు చేరుకున్నారని తెలుసుకున్న వెంటనే ఆ తాళాలను తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా విలువైన వస్తువులు, పత్రాలను తీసుకుంది. వైకుంఠం ఇంటికి వచ్చి బీరువా, అల్మారాలను పరిశీలించగా.. వస్తువులు కనిపించలేదు. కోడలిని ప్రశ్నించగా.. తనకేమీ తెలీదంటూ చెప్పింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి అసలు విషయాన్ని బయటపెట్టారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని