అందుబాటులో ఉండే నాయకుడికే ఓటు
eenadu telugu news
Published : 19/10/2021 04:53 IST

అందుబాటులో ఉండే నాయకుడికే ఓటు

జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి పదవి చేపట్టగానే ప్రజా సమస్యలను విస్మరించే నాయకుడికి కాకుండా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకుడికే ఓటు వేస్తామంటున్నారు యువత. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో పలువురు యువతీ, యువకుల మనోగతం వారి మాటల్లోనే...


ప్రలోభాలకు గురి కాకూడదు
-అఖిల, వాగొడ్డురామన్నపల్లి ఇల్లందకుంట మండలం

ఓటు హక్కును ప్రతి పౌరుడు జన్మహక్కుగా భావించాలి. అలాంటి ఓటును సక్రమంగా వినియోగించుకునేందుకు యువత ముందుకు రావాలి. మనకున్న ఓటు ద్వారా మంచివారిని ఎన్నుకోవాలి. ఉప ఎన్నిక సమయంలో ప్రలోభాలకు గురిచేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి.


స్వేచ్ఛగా ఓటేయాలి

-మేఘమాల, చిన్నకోమటిపల్లి

ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు పలువురు నాయకులు ప్రయత్నిస్తారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలి. ఓటువేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. ఎవరిని ఎన్నుకుంటే మంచి పనులు జరుగుతాయో నిర్ణయించుకోవాలి. అవగాహనతో ప్రతీ పౌరుడు వ్యవహరిస్తే భవిష్యత్తు మన సొంతమవుతుంది.

 


విస్మరిస్తే కష్టాలే

-పరశురామ్‌, ఇల్లందకుంట

ఓటును వినియోగించుకోని వారికి ప్రశ్నించే హక్కులేదు. ఓటు వేసే ముందు ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదు. నేతల తల రాతలను మార్చే శక్తి ఓటుకు ఉంది. ఉప ఎన్నికలో మాయ మాటలు చెప్పే వారికి తగిన గుణపాఠం చెప్పాలి. నిస్వార్థంగా మన హక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలి.


నిస్వార్థంగా పనిచేసే వారై ఉండాలి
-అనగోని రంజిత్‌, సిరిసేడు

ప్రజా సమస్యలపై నిరంతరం నిస్వార్థంగా పనిచేసే వ్యక్తికే ఓటేయ్యాలి. ఉప ఎన్నికలో ఓటు వేసేందుకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రజా సమస్యల పట్ల ఏ మేరకు అవగాహన ఉన్నారో గుర్తించాలి.


మన భవిష్యత్తు మన చేతుల్లోనే
-పెద్ది రాజ్‌కుమార్‌, ఇల్లందకుంట

ఓటు అనే ఆయుధాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడే మన భవిష్యత్తు బాగుంటుంది. నిస్వార్థంగా ప్రజాసేవ చేసే వారికి ఓటు వేయాలనే భావన ప్రతి ఒక్కరిలో రావాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని