పీఎల్‌ఆర్‌ బోనస్‌కు నిధులెట్లా?
eenadu telugu news
Published : 19/10/2021 04:53 IST

పీఎల్‌ఆర్‌ బోనస్‌కు నిధులెట్లా?

దీపావళి ముందు చెల్లింపునకు వేట
సింగరేణికి తొలిసారి తంటా
న్యూస్‌టుడే, గోదావరిఖని

గనిలో కార్మికులు

సింగరేణి వందేళ్ల చరిత్రలో తొలిసారి బోనస్‌ డబ్బుల కోసం తంటాలు పడుతోంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న సింగరేణి నష్టాల నుంచి గట్టెక్కి ఆదర్శ పరిశ్రమగా గుర్తింపు దక్కించుకుంది. వందేళ్లలో ఉద్యోగుల చెల్లింపుల విషయంలో వెనక్కి చూసుకోలేదు. తొలిసారిగా సింగరేణి సంస్థ పీఎల్‌ఆర్‌ బోనస్‌ చెల్లింపునకు ఇబ్బంది పడుతోంది. నిధుల కోసం అప్పుల వేటలో పడింది. ఏటా రూ.26,000 కోట్ల వ్యాపారం చేస్తున్న సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే రూ.11,920 కోట్ల వ్యాపారం చేసింది. కానీ ఉద్యోగులకు పీఎల్‌ఆర్‌ బోనస్‌ డబ్బులు చెల్లించేందుకు నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఏటా దీపావళి ముందు ఉద్యోగులకు బోనస్‌ చెల్లిస్తారు. కోల్‌ ఇండియాలో ఇటీవలే ఒప్పందం జరిగింది. రూ.72,500 చొప్పున ప్రతి కార్మికునికి చెల్లించాలి. దీని కోసం రూ.300 కోట్లు అవసరం ఉంటుంది. ఇప్పటికే లాభాల వాటాతో పాటు దసరా అడ్వాన్స్‌ కింద రూ.300 కోట్ల వరకు చెల్లించింది. పీఎల్‌ఆర్‌ బోనస్‌ కోసం మరో రూ.300 కోట్లు అవసరం కావడంతో అప్పుల వేటలో పడింది. తక్కువ వడ్డీకి చెల్లించే బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోని సింగరేణి తొలిసారిగా డబ్బులు పంపిణీ చేసేందుకు అవస్థలు పడుతోంది.

బ్యాంకులతో సంప్రదింపులు
రుణం కోసం సింగరేణి యాజమాన్యం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే తక్కువ వడ్డీకి రుణం చెల్లించే బ్యాంకుల నుంచి ఆసక్తిని కోరుతూ టెండర్లు ఆహ్వానించింది. బొగ్గు సరఫరా చేస్తున్న సింగరేణికి వినియోగదారుల నుంచి భారీఎత్తున బకాయిలు రావాల్సి ఉంది. బొగ్గు కొనుగోలు చేస్తున్న విద్యుత్తు సంస్థలు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. దీంతో సింగరేణి వద్ద నిధుల కొరత ఏర్పడింది. ఏటా 54 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సింగరేణి అందులో 80 శాతానికి పైగా విద్యుత్తు కేంద్రాలకు సరఫరా చేస్తోంది. వాటి నుంచి ఎప్పటికప్పుడు డబ్బులు రాకపోవడంతో ఉత్పత్తికి అవసరమైన పెట్టుబడులు పెడుతూ మరోవైపు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్న సింగరేణికి నిధుల కొరత ఏర్పడింది. దీంతో బ్యాంకుల నుంచి రుణం కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగులకు బోనస్‌ చెల్లించేందుకు డబ్బులు అవసరం కావడంతో తక్కువ వడ్డీ చెల్లించే బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడానికి సంప్రదింపులు జరుపుతోంది.

బకాయిల వసూలుకు ప్రయత్నాలు
బొగ్గు సంక్షోభం నెలకొన్న క్రమంలో వినియోగదారుల నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. భారీఎత్తున పేరుకుపోయిన బకాయిలను విద్యుత్తు సంస్థల నుంచి కొంత వరకైనా రాబట్టేందుకు దృష్టి సారించింది. థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలకు బొగ్గు అవసరాలు పెరగడంతో సరఫరా నిలిపివేసైనా బకాయిలను వసూలు చేసుకోవడానికి సింగరేణి సంస్థ చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ సంస్థల నుంచి భారీ మొత్తంలో బకాయిలు రావాల్సి ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యుత్తు సంస్థ నుంచి బకాయిలు రావాల్సి ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన బకాయిలు కొద్ది మొత్తంలో ఉన్నాయి. వీటిని కొంత వరకైనా వసూలు చేయగలిగితే ఉద్యోగులకు బోనస్‌తో పాటు రానున్న కాలంలో వేతనాలు, ఇతర ప్రయోజనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో బకాయిలున్న వినియోగదారులను కొంత వరకైనా చెల్లించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని