జిల్లాపై డెంగీ పంజా
eenadu telugu news
Published : 19/10/2021 04:53 IST

జిల్లాపై డెంగీ పంజా

ఆగస్టు నుంచి 163 కేసులు

ప్రాంతీయ ఆసుపత్రుల్లో అరకొరగా కిట్లు

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

కరోనా మహమ్మారి విజృంభణతో ఇప్పటికీ మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా  కోలుకోలేకపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పట్టి ఊపిరి తీసుకుంటుండగా డెంగీ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఆగస్టు నుంచి ఇప్పటివరకు 163 మందికి డెంగీ సోకినట్లు నిర్ధారించారు. జనవరిలో కేవలం 2 కేసులుండగా ఈ ఏడాది చివరి నాటికి 200కు చేరుకునే ప్రమాదం ఉంది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లోనే డెంగీ  విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అనధికారికంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వాళ్లే వందల సంఖ్యలో ఉంటారు. వారికి సంబంధించిన సమాచారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వద్ద అందుబాటులో లేకపోవడంతో వాస్తవ లెక్కలు తెలియడం లేదు. జ్వరం వచ్చిన వెంటనే రోగులు జిల్లాసుపత్రి, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తుండగా తూతూమంత్రంగా ప్యారాసెటమాల్‌ మాత్రలు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. జ్వరం తీవ్రత పెరిగి డెంగీ పరీక్ష కోసం సర్కారు దవాఖానాలకు వెళ్తే అక్కడ కిట్లు అరకొరగా ఉంటున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క డెంగీ కిట్టు అందుబాటులో లేకపోగా ప్రాంతీయ ఆస్పత్రుల్లో ఒక్కో చోట కేటాయించిన 100 కిట్లు నిండుకున్నాయి.

కరీంనగర్‌లోనే నిర్ధారణ
ప్రస్తుతం జిల్లాలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 104 ఉపకేంద్రాలు, 6 అర్బన్‌ కేంద్రాలు, సుల్తానాబాద్‌ సామాజిక ఆసుపత్రి, 3 వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రులున్నాయి. వీటిలో ఎక్కడా డెంగీ నిర్ధారించే ఎలిసా పరీక్షలు చేపట్టడం లేదు. గత జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో లక్ష మంది నుంచి రక్త నమూనాలు స్వీకరించారు. 163 డెంగీ కేసులు, 10 వరకు మలేరియా కేసులు వెలుగుచూశాయి. కరీంనగర్‌లోని ప్రధాన ఆసుపత్రికి వెళ్లాలని చెప్పడంతో అక్కడి రద్దీ దృష్ట్యా కొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడి వారు స్ట్రిప్‌(కార్డు పద్ధతిలో యాంటీజెన్‌ డెంగీ చెక్‌) పరీక్ష నిర్వహించి తెల్ల రక్త కణాలు(ప్లేట్‌లెట్స్‌) తగ్గాయని చెబుతూ అందిన కాడికి దండుకుంటున్నారు.

రూ.లక్షల్లో వదిలించుకోవాల్సిందే!
జ్వరాలతో బాధ పడుతూ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్లేట్‌లెట్లు తగ్గినా, అదనంగా ఎక్కించాలన్నా కరీంనగర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి. కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ఉచితంగా ఉన్నప్పటికి డెంగీ పాజిటీవ్‌ సోకి ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాలంటే రక్త దాతను సమకూర్చినా రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుకు చికిత్సకు రూ.5 వేలు, 4 గంటలకు ఒకసారి ప్లేట్‌లెట్ల సంఖ్య నిర్ధారణ పరీక్షకు రూ.1,500 వసూలు చేస్తున్నారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రతి రోజూ 6 సార్లు పరీక్ష నిర్వహిస్తుండగా దాదాపు రూ.6 వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్లేట్‌లెట్ల సంఖ్య 20 వేల కన్నా తగ్గితే రక్తకణాల ప్యాకెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. సామాన్యునికి డెంగీ సోకితే రూ.లక్షల్లో వెచ్చించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

డెంగీ వ్యాప్తి చెందకుండా చర్యలు: ప్రమోద్‌కుమార్‌, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి
డెంగీ బాధితుడిని కుట్టిన దోమ మరొకరిని కుడితే వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇందుకు కారణమైన దోమలు వృద్ధి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లాలో డెంగీ నిర్ధారణ పరీక్ష కేంద్రం లేకపోవడంతో కరీంనగర్‌కు పంపించాల్సి వస్తోంది. డెంగీ కిట్లు ఒక్క పీహెచ్‌సీలో లేవు. కేవలం ప్రాంతీయ ఆసుపత్రులకే కేటాయించారు. డెంగీ బాధితుల ఇళ్ల వద్ద రసాయనాలతో పిచికారీ చేస్తున్నాం. పరిసరాల్లో ఉండే వారికి జాగ్రత్తలు సూచిస్తున్నాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని