డేగకన్నుతో పహారా
eenadu telugu news
Published : 20/10/2021 03:01 IST

డేగకన్నుతో పహారా

భద్రతాదళాల మోహరింపు
డ్రోన్‌లు, సీసీకెమెరాలతో నిశిత పరిశీలన
ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

జమ్మికుంటలో పోలీసుల కవాతు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు ప్రధాన రాజకీయపార్టీలకు మాత్రమేకాదు.. పోలీసులకు సవాలుగానే మారుతున్నాయి. భద్రతాపరంగా మునుపెన్నడులేని విధంగా ఇక్కడ నిశిత పరిశీలనతోపాటు కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థను  ఏర్పాటు చేస్తున్నారు. రోజురోజుకు ప్రచార ఉద్ధృతి తీవ్రతరమవుతుండటం.. ఊరువాడల్లో ప్రముఖుల పర్యటనలు పెరుగుతుండటంతో అదేస్థాయిలో తమ బలగాల్ని ఇంతకింతకు పెంచుతున్నారు. ఇటీవలకే కేంద్ర బలగాలు రంగప్రవేశం చేశాయి.  తాజాగా దళితబంధు వ్యవహారంలో ఇరుపార్టీల శ్రేణులు నిరసనలకు దిగుతుండటం, కోడ్‌ అమలులో ఉన్నందున ఆందోళన చేసేవారిపై చర్యలకు పోలీసు యంత్రాంగం ఉపక్రమిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శాంతియుతంగా ఎన్నికల్ని నిర్వహించడం కోసం పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రస్థాయి నుంచి ప్రతినిత్యం ఇక్కడి తీరుపై ఆరా తీస్తున్నారు. అందుబాటులో ఉన్న పారామిలటరీ బలగాలతోపాటు అవసరాన్ని బట్టి ప్రత్యేక బలగాలు, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని దింపేలా సన్నాహాల్ని చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రామగుండం కమిషరేట్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌ కమిషరేట్‌ పోలీసులతోపాటు హనుమకొండ జిల్లా పోలీసులంతా ఇక్కడి హుజూరాబాద్‌పై నజర్‌ పెంచుతున్నారు.

సమస్యాత్మక కేంద్రాలపై..
ఈ నియోజకవర్గంలోని 305 పోలింగ్‌ కేంద్రాల్లో 62 వరకు సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నట్లు ఇదివరకే యంత్రాంగం గుర్తించింది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిని బట్టి మరి కొన్నింటిని ఈ జాబితాలో చేర్చేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. పోలింగ్‌ రోజు ఇక్కడ ఆయా వర్గాలకు ఓటింగ్‌ విషయంలో గొడవలు జరుగొద్దనే ఉద్దేశంతో ఇప్పటినుంచే అక్కడి గ్రామాల్లో సీపీ సత్యనారాయణ నేతృత్వంలో పోలీసులు ప్రజల్లో ప్రశాంత వాతావరణం విషయమై అవగాహనను పెంపొందిస్తున్నారు. మరోవైపు పోలీసులు ప్రత్యేకంగా గ్రామాల్లో సంచార కంట్రోల్‌ వాహనంలో తిరుగుతూ తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాల సాయంతో పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఎన్నికలు జరిగే రోజున వీటిని పలు ప్రాంతాల్లో విరివిగా ఉపయోగించేలా చూస్తున్నారు. ఇదే సమయంలో జమ్మికుంట, హుజూరాబాద్‌ పురపాలికల్లోని సీసీ కెమెరాలతోపాటు గ్రామాల్లో ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ తమ కంట్రోల్‌లోకి వచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. ఎక్కడ ఏ తరహా గొడవ అయినా.. ఒకచోటనుంచే వీక్షించేలా సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని చోట్ల శక్తిమంతమైన కెమెరాలను ఏర్పాటు చేసి 360 డిగ్రీల వలయంతో వందల మీటర్ల దూరాన్ని పర్యవేక్షించేలా పహారా కాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  పోలింగ్‌ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేస్తుండటంతో అక్కడి దృశ్యాలను కమాండ్‌ కంట్రోల్‌లో వీక్షించే సదుపాయాల్ని ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో అసత్యప్రచారాలపై ప్రత్యేకమైన ఫోకస్‌ను పెడుతున్నారు. అలాగే ప్రలోబాలపైనా రహస్యంగా తగిన దృష్టిని సారిస్తున్నారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని