8 రోజులే అదను..వ్యూహాలకు పదును
eenadu telugu news
Published : 20/10/2021 03:01 IST

8 రోజులే అదను..వ్యూహాలకు పదును

పతాకస్థాయికి ప్రచారపర్వం

 సమీకరణాలపై పార్టీల దృష్టి
ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

హుజూరాబాద్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. రోజురోజుకు రాజకీయ సమీకరణాలు  మారిపోతున్నాయి.  మూడు పార్టీలు తమదైన పంథాలో  ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. పల్లె, పట్టణం అని తేడాలేకుండా సాగిస్తున్న ప్రచారంలో అభ్యర్థులు ఓటర్ల మనస్సుల్ని గెలిచే తాపత్రయాన్ని  చూపిస్తున్నారు. ఇక ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లేందుకు మూడు పార్టీలు సమాయత్తమై జోరుని పెంచుతుండటంతో ఇక్కడ అసలైన రణరంగం కనిపిస్తోంది.


కదనోత్సాహంతో.. కమలం.!

ఇప్పటి వరకున్న పట్టుని సడలకుండా చూడటంతోపాటు మరింతగా పెంచుకునే జోరుని భాజపా చూపించబోతోంది. ఇందుకోసం నేటి నుంచి తమ పార్టీ అగ్రనాయకగణాన్ని నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనను కొనసాగించే కసరత్తు చేస్తోంది.  బుధవారం  భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు అభ్యర్థి ఈటల రాజేందర్‌ తన ప్రచారాన్ని జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగించనున్నారు. ఈ వారం రోజుల్లో కనీసం పార్టీ అధ్యక్షుడి ప్రచారం 50కిపైగా గ్రామాల్లో ఉండేలా ప్రణాళికని సిద్ధం చేశారు. ఇక మరుసటి రోజునుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, విజయశాంతి, డీకె అరుణ ప్రచార కార్యక్రమాలతో  ముందుకెళ్లనున్నారు.ప్రచార ముగింపు చివరి రెండు రోజులు మాత్రం పట్టణాల్లో కొనసాగించేలా చూసుకుంటున్నారు.


గులాబీ గుబాళించేలా.. తెరాస.!

చేసిన, చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలే పరమావధిగా ఓటు వేటలో గులాబీ శ్రేణులు దూసుకెళ్తున్నాయి. మంత్రి హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌లు తమ పార్టీ అభ్యర్థి గెల్లుశ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి ప్రచార పర్వంలో దూకుడును పెంచుతున్నారు. ఇక నేడు  మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆయా గ్రామాల్లో ప్రచారంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఈనెల 27వ తేదీతోనే ప్రచారాన్ని ముగించాల్సి ఉండటంతో ఆరోజు లేదా అంతకు ఒక రోజు ముందు రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనే బహిరంగ సభను నిర్వహించే జోష్‌లో గులాబీ నేతలున్నారు. ఇప్పటికే విస్తృతంగా చేపట్టిన ప్రచారంలో  ఓటర్లు తమకు అనుకూలంగా ఉన్నారని భావిస్తున్న ఈ పార్టీ శ్రేణులు చివర్లో నిర్వహించే సీఎం సభతో కచ్చితంగా విజయావకాశాలు మరింతగా మెరుగవుతాయనే విశ్వాసంతో ఉన్నారు.


‘రేసు’ను పెంచేలా.. కాంగ్రెస్‌.!

యువత, నిరుద్యోగులతోపాటు సంప్రదాయ ఓటర్లే తమ బలంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా  జోష్‌ను పెంచుతోంది. మూడు పార్టీలతో సాగుతున్న ప్రచార రేసులో ముందుకు దూసుకెళ్లే ప్రయత్నాల్ని చేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ తరఫున పార్టీ రాష్ట్రస్థాయి నేతలంతా ఊరూరా తిరుగుతూ ఆయనకు ఓటెయ్యాలనే ఓటర్ల ఎదుట వినిపిస్తున్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న యువ నేతకు ఒక్క అవకాశం ఇవ్వాలనేలా ప్రచార సందడిలో ఊపుని తెస్తున్నారు.  గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తల బలంతో రోడ్‌షోలతోపాటు యువజన సంఘాలను, మహిళల్ని కలుస్తూ తాము గెలిస్తే ఏమిచేస్తామనే విషయాల్ని అర్థమయ్యేలా వివరిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని