మళ్లీ చెల్లించాల్సిందే!
eenadu telugu news
Published : 20/10/2021 03:01 IST

మళ్లీ చెల్లించాల్సిందే!

ఆన్‌లైన్‌లో నమోదు కాని ఆస్తిపన్ను వివరాలు
నగరపాలిక చుట్టూ తిరుగుతున్నా పట్టింపేదీ?

ఆస్తిపన్ను చెల్లించినట్లుగా ఇచ్చిన రసీదు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌


బకాయిలు ఉన్నట్లుగా ఇంటి యజమానికి చూపుతున్న సీడీఎంఏ వివరాలు

సీతారాంపూర్‌కు చెందిన ఇం.నెం.2-108/5కు సంబంధించిన ఆస్తిపన్ను 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తేదీ.30.5.2020న రూ.2,483 చెల్లించడంతో 020273011 రసీదు ఇచ్చారు. ఈ ఇంటినెంబర్‌పై 2019-20, 2020-21, 2021-22 వరకు వడ్డీ సహా రూ.6,754బకాయి ఉందని డిమాండ్‌ నోటిసు చూపించారు. గతంలో చెల్లించిన మొత్తాన్ని తొలగిస్తే మిగతా మొత్తాన్ని చెల్లిస్తానని సదరు ఇంటి యజమాని తిరుగుతున్నా నగరపాలక అధికారులు పట్టించుకోవడం లేదు.

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి యజమానులు ఆస్తిపన్ను చెల్లించాలంటే ఇంటినెంబర్‌, అసెస్‌మెంట్‌ తప్పనిసరి. వీటితోనే బిల్‌ కలెక్టర్లు ఇంటి పన్నులు తీసుకుంటారు. స్వీకరించిన పన్నుల చెల్లింపు వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడూ నమోదవుతాయి. ఇలా నగరంలో ఎన్ని ఇళ్లు ఉంటే అన్నింటి వివరాలు అంతర్జాలంలో సంక్షిప్తం కావాల్సి ఉంటుంది. అయితే మూడేళ్ల కిందట నగరానికి సమీపంలో ఉన్న పంచాయతీలను నగరపాలికలో విలీనం చేశారు. ఆ సమయంలో ఇళ్లకు సంబంధించిన ఆస్తిపన్నులు రెవెన్యూ సిబ్బంది వసూలు చేసి రసీదులు ఇచ్చారు. ఈ వివరాలను కార్యాలయ రిజిస్టర్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొద్ది నెలలకే పన్నులు చెల్లిస్తున్న వారి ఇళ్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు పురపాలకశాఖ అవకాశం ఇవ్వగా..సిబ్బంది నిర్లక్ష్యంతో కొన్ని ఇంటి నెంబర్లపై పాత బకాయిలు మాత్రం నమోదు చేయకపోవడంతో ప్రస్తుతం వడ్డీతో సహా చెల్లించాలంటున్నారు.

రసీదులున్నా..
నగరంలో విలీనమైన 8 గ్రామాల్లో సుమారు 14,844 ఇళ్లు ఉన్నాయి. వీరంతా అక్కడున్న రెవెన్యూ సిబ్బందికి ఏడాదికి, ఆరు నెలలకొకసారి ఇంటిపన్నులు చెల్లిస్తున్నారు. ఇచ్చిన రసీదుల ఆధారంగా ఆ వివరాలను కార్యాలయ రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. నగరపాలకలోని ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా వందల సంఖ్యలో ఇళ్లను వదిలేసినట్లు తెలుస్తోంది. వీరి దగ్గర రసీదులు ఉండగా నమోదు లేకపోవడం, పాత బకాయిలు చెల్లించాలని కోరుతూ రెవెన్యూ బిల్‌ కలెక్టర్లు ఇంటి చుట్టూ తిరుగుతుండగా పాత బకాయిలు చెల్లించిన రసీదులు చూపిస్తుండటంతో అసలు సమస్య మొదలైంది. తాము చెల్లించిన మొత్తం ఎక్కడ పోయిందని, ఇచ్చిన రసీదు నకిలీదా, నిజమైనదేనా అనే విషయం తెలియక కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులను రెవెన్యూ అధికారులు పరిష్కరించకపోవడం, రేపు, మాపూ అంటూ తిప్పుకోవడం, సరైన సమాధానం ఇవ్వకపోవడంతో సంబంధిత బాధితులు ఆందోళన చెందుతున్నారు.


పోస్టింగ్‌ కోసం సీడీఎంఏకి పంపిస్తాం
-ఆంజనేయులు, రెవెన్యూ అధికారి, కరీంనగర్‌ నగరపాలిక

ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. వీటికి సంబంధించిన జాబితా తయారు చేయించడం జరుగుతోంది. ఆప్షన్‌ ఇవ్వకపోవడంతోనే జాప్యం జరిగింది. పదిరోజుల్లో సీడీఎంఏ కార్యాలయానికి పోస్టింగ్‌ కోసం పంపించడం జరుగుతోంది.


బకాయిలతో వడ్డీ భారం
2021-22ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను వసూలు చేసుకోవడానికి అధికారులు రంగంలోకి దిగారు. ఏడాదికి రూ.24కోట్లు ఆస్తిపన్ను వసూలు చేయాల్సి ఉండటంతో పాత బకాయిలు, ప్రస్తుత చెల్లింపులపై దృష్టిసారించారు. బకాయిలు చెల్లించడానికి ఇంటి యజమానులు ముందుకొస్తుండగా గతంలో చెల్లించి రసీదులు ఉన్న వారు అర్జీలు పెట్టుకున్నారు. వీటిని తొలగిస్తే మిగతా మొత్తాన్ని చెల్లిస్తామని పేర్కొంటుండగా నగరపాలక రెవెన్యూ అధికారులు మాత్రం చెల్లించిన మొత్తానికి కూడా మళ్లీ చెల్లించాలని వడ్డీతో సహా డిమాండ్‌ నోటిసులు పంపించారు. చెల్లించిన మొత్తానికి సవరించకపోవడం, కొత్తగా చెల్లింపులకు సంబంధించి రూ.వేలల్లో వడ్డీ భారం పడుతుంది. ఇలాంటి సమస్యలు సీతారాంపూర్‌, తీగలగుట్టపల్లి ప్రాంతంలో అధికంగా ఉన్నట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ సిబ్బందిపై చర్యలు లేకపోవడంతోనే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని