రోజుకు.. 2 లక్షల టన్నుల ఉత్పత్తి
eenadu telugu news
Published : 20/10/2021 03:22 IST

రోజుకు.. 2 లక్షల టన్నుల ఉత్పత్తి

నవంబరు నుంచి సింగరేణి లక్ష్యం
న్యూస్‌టుడే, గోదావరిఖని

బొగ్గు డిమాండ్‌ పెరగడంతో సరిపడా ఉత్పత్తి చేపట్టేందుకు సింగరేణి సిద్ధమవుతోంది. రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడంతో పాటు నవంబరు నుంచి అంతేస్థాయిలో రవాణా చేయాలని భావిస్తోంది. సింగరేణితో ఒప్పందం ఉన్న విద్యుత్తు కేంద్రాలకు ఎలాంటి లోటు లేకుండా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. సింగరేణి సంస్థ తెలంగాణలోని విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన విద్యుత్కేంద్రాలతో బొగ్గు రవాణా ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం ఒప్పందం ఉన్న వాటికి బొగ్గు కొరత లేకుండా సరఫరా చేస్తున్న సింగరేణి రానున్న కాలంలో మరింత పెంచేందుకు రోజుకు 2 లక్షల టన్నులు రవాణా చేసేందుకు నిర్ణయించింది. ఇందుకనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని అధికారులకు సీఎండీ శ్రీధర్‌ ఆదేశాలు జారీ చేశారు. సింగరేణిపై నమ్మకంతో ఉన్న విద్యుత్కేంద్రాలకు ఎలాంటి కొరత లేకుండా బొగ్గు అందించేలా తమ పరిధిలోని గనుల నుంచి ఉత్పత్తి పెంచేందుకు దృష్టి సారించాలని సీఎండీ సూచించారు.]

టార్గెట్‌ కమిటీ పర్యటన
రానున్న ఏడాదికి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించేందుకు టార్గెట్‌ కమిటీ సింగరేణిలో పర్యటించనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎంత బొగ్గు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకోనుంది. దాని కోసం గనులవారీగా బొగ్గు లభ్యత.. యంత్రాలు.. సౌకర్యాలను అంచనా వేయనున్నారు. ప్రస్తుతం 2021-22 ఆర్థిక సంవత్సరానికి 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఎంత ఉత్పత్తి చేయాలన్నది గనుల్లో అందుబాటులో ఉన్న బొగ్గు పొరలు.. కొత్త గనుల నుంచి వచ్చే ఉత్పత్తి ప్రకారం అంచనా వేయనున్నారు. ప్రస్తుతం సింగరేణి వచ్చే ఏడాదికి జీడీకే-5 ఉపరితల గనితో పాటు నైనీ బొగ్గు బ్లాకు, సత్తుపల్లి ఓసీపీ-2 గనుల్లో పూర్తి స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేయనున్నాయి. ప్రస్తుత ఏడాది 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనున్న సింగరేణి రానున్న ఆర్థిక సంవత్సరంలో 80 మిలియన్‌ టన్నులను లక్ష్యంగా నిర్దేశించుకునే అవకాశం ఉంది.

రవాణా సౌకర్యాలు పెంపు
బొగ్గు ఉత్పత్తితో పాటు రవాణా సౌకర్యాలను పెంచే ప్రయత్నం చేస్తోంది. 115 మిలియన్‌ టన్నుల బొగ్గు రవాణా చేసే సామర్ధ్యం కలిగి ఉండేలా సిద్ధం కావాలని భావిస్తున్న సింగరేణి రైలు మార్గం ద్వారా అవకాశం ఉన్న ప్రాంతానికి చేరుకునేలా పనులు చేపడుతోంది. సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వరకు 54 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మాణం పనులు సాగుతున్నాయి. ఇప్పటివరకు 26 కిలోమీటర్ల మేర పూర్తి చేసిన సింగరేణి మిగతా పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. సత్తుపల్లి ఉపరితల గనుల నుంచి ఉత్పత్తవుతున్న బొగ్గును సులువుగా రవాణా చేసేందుకు రైలు మార్గం అవసరం ఉంది. ఇక్కడి నుంచి రోజుకు 30 వేల టన్నుల బొగ్గు రవాణా చేయాల్సి ఉండటంతో రైలుమార్గం ద్వారా వేగంగా సరఫరా చేసే అవకాశం ఉంది. రైలు మార్గంతో పాటు సీహెచ్‌పీల సామర్ధ్యం కూడా పెంచుతోంది. వీటితో వినియోగదారులకు బొగ్గు రవాణా వేగంగా చేపట్టే అవకాశం ఉంటుందని భావిస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని