వరి సాగుపై గందరగోళం
eenadu telugu news
Published : 20/10/2021 03:22 IST

వరి సాగుపై గందరగోళం

విత్తన రాయితీపై కొరవడిన స్పష్టత
ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన
ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

కాట్నపల్లిలో ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తున్న డీఏవో తిరుమలప్రసాద్‌(పాతచిత్రం)

వచ్చే యాసంగి సీజన్‌ నుంచి వరి సాగు చేయొద్దంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తుండటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది రైతువేదికల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేయాలంటూ సూచిస్తున్నారు. దీంతో విత్తన సంస్థలు ఇప్పటికే సిద్ధం చేసుకున్న నిల్వలు పేరుకుపోయేలా ఉన్నాయి.
ప్రతి సంవత్సరం విత్తనాభివృద్ధి సంస్థ రైతులకు రాయితీపై వరి విత్తనాలను సరఫరా చేస్తోంది. ఈసారి వరిని పూర్తిగా తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వరంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలకు చెందిన విత్తనాలు కూడా విక్రయించవద్దని వ్యవసాయ శాఖ ప్రకటించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు బహుళజాతి సంస్థలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండగా ప్రభుత్వరంగ సంస్థలు గోదాముల్లో నిల్వలు పెట్టుకుని ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాయి.

25 శాతానికి తగ్గించడమే లక్ష్యం
జిల్లాలో ఏటా యాసంగిలో 80 శాతం విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురవడంతో భూగర్భ జలం సమృద్ధిగా ఉంది. కాళేశ్వరం, ఎల్లంపల్లి, మానేరు, ఎస్సారెస్పీ, తదితర జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. దీంతో సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగయ్యే అవకాశాలున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం యాసంగిలో వరి సాగును 25 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. శాస్త్రవేత్తలు, అధికారులతో కలిసి వరి మినహా ఇతర పంటలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వాటిని సాగు చేసేలా మెలకువలు, శిక్షణ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో యాసంగిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 2,17,835 ఎకరాలు కాగా ఈ ఏడాది 25 శాతానికి తగ్గించి, అంటే దాదాపు 54,458 ఎకరాలకే వరి సాగును పరిమితం చేయాలంటూ రైతులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.


ఉత్తర్వులు వస్తేనే స్పష్టత
తిరుమలప్రసాద్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

జిల్లాలోని 54 క్లస్టర్ల రైతువేదికల పరిధిలోని రైతులందరికీ వరి సాగు తగ్గించాలని, ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని అవగాహన కల్పించాం. పప్పుదినుసులు, ఉద్యాన పంటలు వేసేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వస్తేనే విత్తనాల సరఫరా, రాయితీపై స్పష్టత వచ్చే అవకాశముంది.


అన్నదాతపై విత్తన భారం
* వరి సాగు వద్దని చెప్పిన ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా పప్పుదినుసులు, వాణిజ్య, ఉద్యాన పంటలు విత్తుకోవడానికి రాయితీపై విత్తనాలను ఇస్తే ప్రోత్సాహకరంగా ఉండేది. యాసంగిలో ఆరుతడి పంటలుగా శనగ, కంది, పెసర, మినుములు, మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తారు.
* ఇప్పటివరకు విత్తనాల ధర, రాయితీని ప్రభుత్వం ప్రకటించకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి ధరతోనే విత్తనాలు విక్రయించేందుకు సహకార సంఘాలతో పాటు ప్రైవేటు వ్యాపారులు నిల్వలను సిద్ధం చేసుకుంటున్నారు.
* జిల్లాలో శనగ సాధారణ సాగు విస్తీర్ణం మేరకు 10 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. ఈ ఏడాది ఎలాంటి రాయితీ లేకపోవడంతో క్వింటాలుకు రూ.6,800 చెల్లించాల్సి ఉంటుంది. ఎకరాకు 25 కిలోల విత్తనం అవసరం అవుతుండగా రైతులకు అదనపు భారంగా మారనుంది.
* వరి విత్తనాలకూ గతంలో కిలోకు రూ.5 చొప్పున రాయితీ ఉండేది. ఇకపై ఇది అమలు కాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ యాసంగిలో సరఫరా చేసేందుకు ఇప్పటికే నిల్వ చేసిన విత్తనాల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
* ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినప్పటికీ వరి సాగుకు సంబంధించి లిఖితపూర్వక మార్గదర్శకాలు రాలేదు. దీంతో అధికారులు గోదాముల్లోనే విత్తన బస్తాలను నిల్వ చేశారు.
* త్వరలో ప్రారంభమయ్యే యాసంగి సాగుకు చాలా రోజుల ముందే అంటే ఆగస్టు నెల నుంచే టీఎస్‌ సీడ్స్‌ సంస్థ విత్తన ధాన్యాన్ని సేకరించి శుద్ధి చేసి 25 కిలోల చొప్పున సంచులు సిద్ధం చేసింది.



 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని