ఊడుస్తుందని కొన్నారు.. మూలన పడేశారు
eenadu telugu news
Updated : 20/10/2021 06:25 IST

ఊడుస్తుందని కొన్నారు.. మూలన పడేశారు

రూ. 46 లక్షల నిధులు వృథా
జగిత్యాల పట్టణం, న్యూస్‌టుడే


పనిచేయని స్వీపింగ్‌ వాహనం

 

ప్రధాన రహదారిలో అపరిశుభ్రత

పట్టణంలో రహదారులను శుభ్రం చేసేందుకు బల్దియా గత ఏడాది పట్టణ ప్రగతి నిధులు రూ.46 లక్షలు వెచ్చించి ఊడ్చే వాహనం (స్వీపింగ్‌ వెహికిల్‌) కొనుగోలు చేశారు. కొత్త వాహనాన్ని 4 నెలల వరకూ అధికారులు ప్రారంభించకపోగా ఇటీవలే బయటకు తీశారు. వారం పది రోజులు ప్రధాన రహదారి శుభ్రం చేసేందుకు వాహనాన్ని వినియోగించారు. కానీ పూర్తిస్థాయిలో రోడ్లు శుభ్రం చేయడం సాధ్యం కాలేదు. ఎందుకంటే ఈ వాహనం కేవలం డివైడర్ల మధ్యనున్న మట్టి, దుమ్మును మాత్రమే శుభ్రం చేయగలదు. కేవలం ఐదు అడుగుల మేరకు వాహనం శుభ్రం చేస్తే మిగతా రోడ్లును పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేయాల్సి వచ్చేది. కాగా స్వీపింగ్‌ వాహనానికి ఇక్కడి రోడ్లు అనుకూలంగా లేవు. దీంతో పలు రహదారుల్లో శుభ్రత సాధ్యం కాకపోవడంతో బల్దియా సిబ్బంది వాహనాన్ని పక్కన బెట్టారు. ఇటీవల బతుకమ్మ వేడుకల కోసం స్వీపింగ్‌ వాహనాన్ని బయటకు తీయగా అందులోని పైపులు పగిలి పోవడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. మరమ్మతు చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఆ వాహనం కొత్త బస్టాండు నీళ్ల ట్యాంకు వద్ద వృథాగా ఉంచారు.

సిబ్బంది మధ్య సమన్వయ లోపం..
బల్దియాలో వాహనాల నిర్వహణ, మరమ్మతుల విషయంలో ఇంజినీరింగ్‌, పారిశుద్ధ్య సిబ్బంది మధ్య సమన్వయలోపం కనిపిస్తోంది. వాహనాల కొనుగోలుతో పాటు మరమ్మతుల వ్యవహారం ఇంజినీరింగ్‌ విభాగమే బాధ్యత వహిస్తుంది. కానీ బల్దియాలో పలు వాహనాల మరమ్మతు పారిశుద్ధ్య సిబ్బంది కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. తాజాగా కొనుగోలు చేసిన స్వీపింగ్‌ వాహనం ఇప్పటి వరకూ పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించక పోవడం ఇంజినీరింగ్‌ విభాగం అధికారుల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తోంది. అప్పగించని వాహనాన్ని రోడ్లపై తిప్పకుండానే మరమ్మతుకు గురైందని చెప్పడం పారిశుద్ధ్య సిబ్బందికే చెల్లింది. స్వీపింగ్‌ వాహనం కొనుగోలులో చూపిన ఉత్సాహం మరమ్మతుల్లో చూపకపోవడం గమనార్హం.

5 ట్రాక్టర్లు.. 10 కొత్త ఆటోలొచ్చేవి...
బల్దియా వెచ్చించిన రూ.46 లక్షల స్వీపింగ్‌ వాహనం వినియోగానికి దూరమైంది. ఇవే నిధులు వెచ్చిస్తే చెత్తసేకరణకు అవసరమైన 5 కొత్త ట్రాక్టర్లు, 10 కొత్త ఆటోలైనా వచ్చేవని పాలకవర్గంలోని కొందరు సీనియర్‌ కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఎలాంటి ఉపయోగంలేని వాహనం కొని మూలనపడేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆటోలు, ట్రాక్టర్లతో వార్డుల్లో చెత్తసేకరణకు అవరోధాలు తొలగిపోయేవని మరోవైపు మరో 20 మంది తాత్కాలిక సిబ్బంది నియామకం జరిగి పారిశుద్ధ్య సమస్యలు పరిష్కారమయ్యేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 


మరమ్మతులకు సూచించాము
స్వరూపరాణి, కమిషనర్‌ జగిత్యాల

స్వీపింగ్‌ వాహనం ఇటీవల బతుకమ్మ వేడుకల్లో మరమ్మతుకు గురైంది. హైదరాబాద్‌ నుంచి సాంకేతిక నిపుణులు వచ్చి పరిశీలించారు. విడిభాగాలు వచ్చిన వెంటనే మళ్లీ అందుబాటులోకి తెస్తాం. వారం రోజుల్లో రహదారి శుభ్రతకు వాహనం వినియోగిస్తాం.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని