భూ తగాదాలతో తండ్రీకొడుకులపై దాడి
eenadu telugu news
Published : 20/10/2021 03:31 IST

భూ తగాదాలతో తండ్రీకొడుకులపై దాడి

కుమారుడు అక్కడికక్కడే మృతి

పాజుల్‌నగర్‌లో హత్యకు గురైన మహేష్‌

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గత కొంత కాలంగా జరుగుతున్న భూ తగాదాలకు కుమారుడు బలి కాగా తండ్రి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రి పాలైన సంఘటన వేములవాడ గ్రామీణ మండలంలోని పాజుల్‌నగర్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామంలో పిట్టల లక్ష్మీనర్సయ్య, రాజేశం అన్నదమ్ములు. అయిదు ఎకరాల వ్యవసాయ భూమి పంపకంపై మూడేళ్లుగా వీరి మధ్య భూతగాదా కొనసాగుతోంది. పలుమార్లు కుల పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో తమ్ముడిపై అన్న కక్ష పెంచుకొని తమ్ముడిని హత్య చేయాలని పథకం రచించాడు. మంగళవారం తమ్ముడు పిట్టల రాజేశం వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో ఇంటి వద్ద అన్న లక్ష్మీనర్సయ్య, అతని కుమారుడు పర్షరాములు మాటు వేసి పదునైన కత్తులతో దాడి చేశారు. రాజేశం తీవ్ర గాయాలతో పడి ఉన్న సమయంలో అప్పుడే ఇంటి వద్దకు వచ్చిన ఆయన కుమారుడు మహేష్‌ (30) దాడిని అడ్డుకోబోయాడు. దీంతో అతనిపై కత్తులతో దాడి చేశారు. ఈ సంఘటనలో మహేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రాజేశంను స్థానికులు 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి కరీంనగర్‌ తీసుకెళ్లారు. సంఘటన స్థలాన్ని వేములవాడ గ్రామీణ సీఐ బన్సిలాల్‌, ఎస్సై మాలకొండ రాయుడు పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్‌ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. హత్య సంఘటనతో మృతుని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మృతుడికి భార్య ఉంది. హత్య సంఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని