పౌరులకు న్యాయసేవలపై అవగాహన అవసరం
eenadu telugu news
Published : 24/10/2021 04:29 IST

పౌరులకు న్యాయసేవలపై అవగాహన అవసరం

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జడ్జి ప్రియదర్శిని

సిరిసిల్ల పట్టణం, న్యూస్‌టుడే: పౌరులు న్యాయసేవలు, చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జడ్జి ఎం.జి.ప్రియదర్శిని పేర్కొన్నారు. సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో శనివారం జాతీయ న్యాయసేవ కార్యక్రమంలో భాగంగా అసంఘటిత రంగాల్లోని కార్మికులకు న్యాయసేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె జ్యోతిని వెలిగించి ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ప్రజలకు ఉచిత న్యాయసేవలు అందించడం, సంక్షేమ చట్టాలపై తెలియజేయడం, లోక్‌ అదాలత్‌ ద్వారా సత్వర న్యాయం అందించడం నాల్సా చట్టం ఉద్దేశమని ఆమె తెలిపారు. చట్టం, న్యాయం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమేనని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు చట్టాలు, న్యాయసేవలపై అవగాహన లేదన్నారు. వారికి సరైన పద్ధతిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత తమదేనన్నారు. అనంతరం ఆమె గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో మహిళా సమాఖ్యలకు రుణ చెక్కులు, 52 మంది దివ్యాంగులకు సదరం ధ్రువీకరణ పత్రాలు అందించారు. కులాంతర వివాహాలు చేసుకున్న 5 జంటలకు ఎస్సీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో రూ.2.50 లక్షల బాండ్‌, అసంఘటిత రంగం కింద నమోదైన వారికి ఈ-శ్రమ్‌కార్డులను, ముగ్గురు దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లను ఆమె చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆమె సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహాలు చేస్తే కలిగే నష్టాలపై చిన్నారులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా 9వ అదనపు సెషన్స్‌ జడ్జి ఎం.జాన్సన్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌, ఎస్పీ రాహుల్‌హెగ్డే, కరీంనగర్‌ జిల్లా న్యాయసేవల కార్యదర్శి బి.సుజయ్‌, ఇన్‌ఛార్జి డీఆర్‌వో శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ కమిషనర్లు సమ్మయ్య, శ్యామ్‌సుందర్‌రావు పాల్గొన్నారు.

మహిళల స్టాల్‌ను సందర్శిస్తూ...


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని