భూ ప్రకంపనతో ఆందోళన
eenadu telugu news
Published : 24/10/2021 04:29 IST

భూ ప్రకంపనతో ఆందోళన

గోదావరిఖని-జ్యోతినగర్‌, న్యూస్‌టుడే : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భూకంపం కలకలం రేపింది. పారిశ్రామిక ప్రాంతంలోని మల్కాపూర్‌, నర్రశాలపల్లి, కృష్ణానగర్‌ ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు భూమి కంపించటంతో ఆందోళన నెలకొంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించటంతో ఇళ్లలో ఉన్న వారు ఉలిక్కి పడ్డారు. మరో 20 నిమిషాల తర్వాత మళ్లీ భూమి కంపించటంతో ఇళ్లలో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు. సింగరేణి ఉపరితల గనుల పేలుళ్లతో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కంపించటం కోల్‌బెల్ట్‌ ప్రాంత ప్రజలకు అలవాటు. అదే క్రమంలో భూమి కంపించి ఉంటుందని ప్రజలు అనుకుంటున్న క్రమంలో రెండు సార్లు ఒక్కసారిగా భూమిలో స్వల్పంగా కదలికలు రావటంతో ఇళ్లలో ఉన్న వస్తువులు కిందపడ్డాయి. 2 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించటంతో పాటు కృష్ణానగర్‌, మల్కాపూర్‌, నర్రశాలపల్లి ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ విషయం దావానలంలా పారిశ్రామిక ప్రాంతంలో విస్తరించటంతో ప్రజలు దీనిపై చర్చించుకున్నారు. సింగరేణి ఉపరితల గనులు ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతం నిత్యం కంపిస్తూ ఉంటుంది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.00 పాయింట్లుగా నమోదైంది. 2 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు నమోదు కావటం ఈ ప్రాంతంలో తొలిసారిగా భూకంప ప్రభావం ప్రత్యక్షంగా ప్రజలు గమనించారు. గతంలో 50 ఏళ్ల క్రితం ఒకసారి ఇదే విధంగా పారిశ్రామిక ప్రాంతంలో భూమి కంపించింది. ఆ తర్వాత ఇలా భూప్రకంపనలు రావటం ఇక్కడి ప్రజలను ఆందోళన కలిగించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని