చేజారిన హక్కు.. వేలమే దిక్కు
eenadu telugu news
Published : 24/10/2021 04:29 IST

చేజారిన హక్కు.. వేలమే దిక్కు

 సింగరేణికి అశనిపాతంగా కేంద్ర నిర్ణయం

న్యూస్‌టుడే, గోదావరిఖని

బొగ్గు నింపుతున్న షావల్‌ యంత్రం

వందేళ్లకు పైగా చరిత్ర.. బొగ్గు ఉత్పత్తి రంగంలో అపార అనుభవం.. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బొగ్గు నిక్షేపాలకు గుత్తాధిపత్యం.. ఇవన్ని ఇక చెల్లకుండా పోయాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధన సింగరేణికి కూడా అనుసరించాల్సిన పరిస్థితి. బొగ్గు ఉత్పత్తిలో ఎంతో అనుభవం ఉన్న సింగరేణి అన్వేషణలో కూడా ప్రత్యేకత ఉంది. బొగ్గు నిక్షేపాలను గుర్తించడమే కాదు అందులో ఉన్న నాణ్యత.. ఎంత లోతుల్లో ఉన్నాయన్న వాటిని నిర్ధారించే సింగరేణి తెలంగాణ ప్రాంతంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న నిక్షేపాలకు ఇప్పటి వరకు సొంతవన్న నమ్మకం ఉండేది. ఇప్పటి వరకు 11,650 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలను గుర్తించిన సింగరేణి వాటిని వెలికి తీసేందుకు బొగ్గు గనుల ద్వారా ప్రణాళికలు చేసుకుంది. ఇప్పటి వరకు సుమారు 39 గనుల వరకు ప్రతిపాదనలు చేసుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనతో సింగరేణి అన్వేషణ చేసిన బొగ్గు బ్లాకులు వేలం పాటల్లోకి వెళ్లాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకులను బహిరంగ వేలానికి ప్రకటన చేసింది. ఇందులో సింగరేణికి చెందిన నాలుగు బ్లాకులున్నాయి. ఈ నాలుగు బ్లాకుల్లో అన్వేషించేందుకు సంస్థ రూ.60 కోట్ల వరకు వెచ్చించింది. డ్రిల్లింగ్‌ పనులు చేపట్టడంతో పాటు బొగ్గు క్షేత్రాలకు సంబంధించిన నివేదికలు కూడా తయారు చేసుకుంది. సింగరేణికి చెందిన సత్తుపల్లి బ్లాకు-3, కళ్యాణిఖని-6, కొత్తగూడెం బ్లాక్‌-3, శ్రావణ్‌పల్లి బ్లాకులను కేంద్రం వేలంలో చేర్చింది.

100 మిలియన్‌ టన్నులు కష్టమే

సింగరేణి సంస్థ రానున్న కాలంలో 100 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం దిశగా ప్రణాళికలు వేసుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం సింగరేణికి చెందిన బొగ్గు క్షేత్రాలకు వేలం పాటకు నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో కొత్త గనులు దక్కించుకోవడం కష్టంగా కనిపిస్తోంది. మిగతా కంపెనీలతో పోటీపడి బొగ్గు క్షేత్రాలను దక్కించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు సింగరేణి ప్రాంతాల్లో ఉన్న బొగ్గు క్షేత్రాలు సంస్థకే అన్న ధీమా ఉండేది. దీంతో భవిష్యత్తులో 100 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సాధ్యమన్న నమ్మకం పెట్టుకుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వేలం పాటల్లో చేర్చిన నాలుగు బొగ్గు బ్లాకులు కూడా సింగరేణికే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. అయితే నిబంధనల ప్రకారం వాటిని వేలం పాటల్లో ప్రకటించడంతో సంస్థ ఆదీనంలో ఉన్న బొగ్గు క్షేత్రాలపై నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే 100 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించడం కష్టంగా కనిపిస్తోంది.


భవిష్యత్తు గనులపై సన్నగిల్లుతున్న ఆశలు

సింగరేణి ప్రణాళికలో చేర్చుకున్న మరిన్ని భవిష్యత్తు గనులపై ఆశలు సన్నగిల్లే అవకాశాలున్నాయి. సింగరేణి సంస్థ నిరంతరం అన్వేషణ ద్వారా ఏటా కొత్త గనులను గుర్తిస్తుంది. బొగ్గు నిక్షేపాలను గుర్తించడంతో పాటు కొత్త బ్లాకులను గుర్తించి అందులో బొగ్గు ఉత్పత్తి చేపట్టే ప్రణాళికలు తయారు చేసుకుంటుంది. సింగరేణి సంస్థ కొత్తగా భవిష్యత్తులో 39 గనుల వరకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. వాటిపై తాజా నిబంధనలతో ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సింగరేణి సంస్థ రాంపూరు, చండ్రుపల్లి, తాడిచెర్ల, గుండాల, లింగాల, వెంకటాపూర్‌, పెనగడప, పెద్దాపూర్‌, పునుకుడుచిలకతో పాటు మరో 30 బొగ్గు క్షేత్రాలను గుర్తించింది. 218.79 చదరపు కిలోమీటర్ల మేర బొగ్గు నిక్షేపాల అన్వేషణ చేసిన సింగరేణి 3,609 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలను గుర్తించింది. 9 లక్షల మీటర్ల మేర డ్రిల్లింగ్‌ పనులు చేపట్టిన సింగరేణి వీటిపై భరోసాతో ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆశలు వదులుకునే పరస్థితి ఏర్పడింది. సింగరేణి సంస్థ వీటి కోసం ఏళ్ల తరబడి అన్వేషణ పనులు చేపట్టింది. ప్రత్యేకంగా డ్రిల్లింగ్‌ పనులు చేపట్టి నిక్షేపాలను గుర్తించడంతో పాటు బొగ్గు పొరల నాణ్యతను అంచనా వేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని