తెర వెనుక .. రాజకీయ చాణక్యం
eenadu telugu news
Updated : 24/10/2021 06:35 IST

తెర వెనుక .. రాజకీయ చాణక్యం

 చక్రం తిప్పుతున్న స్థానికేతర నేతలు

హుజూరాబాద్‌ కేంద్రంగా భిన్న వ్యూహాలు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

ఒకరుకాదు ఇద్దరు కాదు.. వందల సంఖ్యలో హుజూరాబాద్‌లో మకాం వేసిన ఆయా పార్టీల రాజకీయ పెద్దలు తమదైన రాజకీయ చతురతను ఈ ఉప ఎన్నికల్లో రంగరిస్తున్నారు. పోలింగ్‌ తేదీకి ముందు తమలో దాగిన చాణక్య వ్యూహాలను చాకచక్యంగా ప్రదర్శిస్తున్నారు. ఇలా మూడు పార్టీలకు చెందిన స్థానికేతర నేతలే అసలైన వ్యూహాల్ని అమలు చేసేందుకు కసరత్తును చేస్తున్నారు. రోజంతా సాగుతున్న ప్రచారం ఒకెత్తైయితే.. రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు ఆయా మండలాలపై ఎలా పాగా వేయాలనేలా మేథోమదనాన్ని సాగిస్తున్నారు. గెలుపు బాటలో నిలబడేందుకు పలు కోణాల్లో పనుల్ని విభజించుకుని ఆ దిశగా అడుగులేస్తున్నారు. కేటగిరీ వారీలుగా ఆయా పనుల్ని అప్పగిస్తూ శ్రేణుల్ని రేయింబవళ్లు అప్రమత్తంగా ఉంచుతున్నారు.

వారిదే ‘హవా’ అనేలా..

మూడు పార్టీల అభ్యర్థులకు అందిస్తున్న సూచనల్లో ఇతరప్రాంతాల నుంచి వచ్చిన వారి వ్యూహాలే కీలకంగా మారుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు ఇక్కడి గెలుపును సవాలుగా స్వీకరించడంతో జాతీయ, రాష్ట్రస్థాయి ముఖ్యనేతలతోపాటు హైద్రాబాద్‌, సిద్దిపేట, ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల నుంచి వచ్చిన వందలాది మంది నాయకులు తమ రాజకీయ అనుభవాల్ని ఇక్కడి ఆటలో చూపిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ ఎదురైన అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఆయా స్థాయిల్లో బాధ్యతల్ని చేపట్టిన వారంతా ఇక్కడి ప్రచారశైలిపై గత కొన్నాళ్లుగా దృష్టిని సారిస్తున్నారు.  పైకి మాత్రం స్థానిక నాయకత్వాన్ని ఓటర్లకు కనిపించేలా ఉంచుతున్నప్పటికీ వెనుకాల జరపాల్సిన తతంగాల్ని ఇతర ప్రాంతాల నాయకగణమే నడిపిస్తుండటం గమనార్హం. పొరుగు జిల్లాల నుంచి వారు కూడా ప్రచారంలో పోటాపోటీగా భాగస్వామ్యం అవుతున్నారు. వీలుని బట్టి మాత్రమే వీరి ప్రాధాన్యతను చూపిస్తున్నారు. మిగతా సందర్భాల్లో తమదంతా అంతర్గత వ్యూహమనేలా బయటికి కనిపించకుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఓటర్లను ఏ అంశాల ద్వారా మచ్చిక చేసుకోవచ్చనే మంత్రాన్ని పక్కాగా ఆచరణలో పెట్టేలా చూస్తున్నారు.  

పరిస్థితిని బట్టి ఎత్తుగడ..

నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ప్రస్తుతం పార్టీకి ఎలాంటి పరిస్థితి ఉందనే విషయాన్ని ఆరా తీసుకుంటూ తమ వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. తమకు బలంగా ఉన్న ప్రాంతాలతోపాటు బలహీనమనుకునే చోట ఎలా ఓట్లను తిప్పాలనే విషయంలో నాయకులు తమ పాచికల్ని పారించేలా ఎత్తుగడల్ని రహస్యంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఒకే ఇంట్లో ఎక్కువ ఓట్లున్న వారి వద్దకు పదే పదే వెళ్తున్నారు. మహిళలు, యువ ఓటర్లకు చేరువయ్యేందుకున్నదారుల్ని వెతుకుతున్నారు. అవసరాన్ని బట్టి ప్రలోభాలకు తెర తీయాలనే ఉద్దేశాన్ని ఆచరణలో అక్కడక్కడ చూపిస్తున్నారు. ఈనెల 27వ తేదీ వరకే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఆ తరువాత రెండు రోజులు కీలకమవడంతో అప్పుడు చేపట్టాల్సిన చర్యలపై ఇక్కడి నేతలకు సూచనలిస్తున్నారు. ఎన్నికలు జరిగే 30వ తేదీకి ముందర 72 గంటలే కీలకమవడంతో ఆ సమయాన్ని సద్వినియోగపర్చుకుని ఓటు బలాన్ని విజయానికి అవసరమైనట్లుగా అందుకోవాలనే కృతనిశ్చయాన్ని చేతల్లో చూపిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని