ప్రజా సమస్యలపై ప్రశ్నించే వ్యక్తి ఈటల
eenadu telugu news
Published : 27/10/2021 04:17 IST

ప్రజా సమస్యలపై ప్రశ్నించే వ్యక్తి ఈటల


వావిలాలలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

జమ్మికుంట, జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను రాజకీయాల నుంచి పూర్తిగా కునుమరుగు చేయాలని చూశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. జమ్మికుంట పట్టణంతో పాటు మండలంలోని వావిలాల, నాగంపేట, కోరపల్లి, మడిపల్లి గ్రామాలలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం  నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ...ప్రజల సమస్యలను అసెంబ్లీలో వినిపించే వ్యక్తి కావాలా...కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు బానిసగా ఉండే వ్యక్తి కావాలా ఇక్కడి ప్రజలు ఆలోచించాలన్నారు.  కార్యక్రమంలో భాజపా నాయకులు ధర్మారావు, శీలం శ్రీనివాస్‌, బీడి మల్లేశ్‌, ఆకుల రాజేందర్‌, సురేందర్‌రాజు, సంపెల్లి సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు. ప్రచారం అనంతరం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్ఠాన్‌ను సందర్శించారు. ఖాదీ వస్త్రాలను పరిశీలించి బాగున్నాయని కితాబు ఇచ్చారు.


అబద్ధాల భాజపాను నమ్మకూడదు
మంత్రి హరీశ్‌రావు

సింగాపూర్‌లో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

హుజూరాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాసను ఆశీర్వదించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌లో మంగళవారం తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ తరఫున ఆయన ప్రచారం చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి భాజపా ఏం చేసిందని ఓట్లడుగుతున్నారని...అబద్ధాల భాజపాను నమ్మకూడదన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి మంద మంజుల, ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ ఇరుమల్ల రాణి తదితరులున్నారు.

జమ్మికుంట గ్రామీణం : ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సెంటిమెంట్‌ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ధూంధాం కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు.


కాంగ్రెస్‌తో భాజపా నాయకుల కుమ్మక్కు
మంత్రి గంగుల కమలాకర్‌

మాట్లాడుతున్న మంత్రి గంగుల చిత్రంలో తెరాస నేత మోత్కుపల్లి

హుజూరాబాద్‌ పట్టణం, గ్రామీణం: మాయమాటలు చెప్పే భాజపా నేతలను నమ్మవద్దని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, తెరాస నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. హుజూరాబాద్‌లోని సూపర్‌బజార్‌ రహదారిలో ధూంధాం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు తమ ఆటపాటలతో సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కాంగ్రెస్‌ నాయకులు భాజపాతో కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ సభను నిర్వహించకుండా అడ్డుకోవటం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌, పలువురు నేతలు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


కేంద్ర, రాష్ట్ర పాలకులకు గుణపాఠం చెప్పాలి
ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్‌కృష్ణన్‌

మాట్లాడుతున్న ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్‌కృష్ణన్‌

జమ్మికుంట, జమ్మికుంట గ్రామీణం: హామీలను విస్మరించి దగా చేస్తున్న కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పాలకులకు ఉప ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్‌కృష్ణన్‌ అన్నారు. మంగళవారం జమ్మికుంట కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, పీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్‌ మల్లు రవి, కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్యలతో కలిసి మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రభుత్వం రైతులపై ఉక్కుపాదాన్ని మోపిందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస మొదటి నుంచే హామీలను విస్మరించిదన్నారు.  మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మాట్లాడతూ ధాన్యం సాగుపై ఆంక్షలు విధించటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి, జమ్మికుంట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు జి.సారంగపాణి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని