ఆన్‌లైన్‌ తాళం.. ధరలకు కళ్లెం
eenadu telugu news
Published : 27/10/2021 04:17 IST

ఆన్‌లైన్‌ తాళం.. ధరలకు కళ్లెం

పెద్దపల్లిలో పత్తి రైతుల ఆందోళన

ఆందోళన చేసిన రైతులను మార్కెట్‌లోకి తీసుకెళ్తున్న అధికారులు, పోలీసులు

న్యూస్‌టుడే, పెద్దపల్లి: సీజన్‌ ఆరంభం నుంచి క్వింటాలు పత్తికి రూ.7 వేలకు పైగా ధర పలుకుతుండటం.. మరో నెల రోజుల్లో రూ.10 వేల మార్కుకు చేరుకుంటుందనే ప్రచారం నేపథ్యంలో పెద్దపల్లి మార్కెట్‌లో మంగళవారం ఆన్‌లైన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య రైతులను ఆందోళనకు గురిచేసింది. కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన పత్తి ధరలు ఈ నామ్‌లో కనిపించకపోవడంతో గందరగోళం చోటుచేసుకుంది. వ్యాపారులు ఉద్దేశపూర్వకంగానే ధరలను తగ్గించారనే కొందరు రైతులు ఆందోళనకు దిగారు. అయితే అధికారులు, పోలీసులు సకాలంలో స్పందించడంతో సమస్యకు పరిష్కారం లభించింది.

పెద్దపల్లి మార్కెట్‌లో ఇటీవల పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా మంగళవారం నుంచి ఈనామ్‌(ఆన్‌లైన్‌)లో కొనుగోళ్లు ప్రారంభించారు. మార్కెట్‌కు వచ్చిన అయిదుగురు కొనుగోలుదారుల్లో ఇద్దరు వ్యాపారులు నమోదు చేసిన ధరలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ కాలేదు. క్వింటాలుకు రూ.7000 కంటే తక్కువ ధర నమోదు చేసిన వివరాలు మాత్రమే ఈనామ్‌ తెరపై కనిపించాయి. దీంతో ఎక్కువ ధర కోట్‌ చేసిన వ్యాపారులతో పాటు రైతులు కూడా ఆందోళనకు దిగారు. మార్కెట్‌లో రూ.7 వేలకు పైగా ధర పలుకుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో తక్కువ పలకడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

నియంత్రణ విధింపుతోనే సమస్య
గతేడాది పత్తి ధరలు భారీగా పతనం కావడంతో ఈ నామ్‌లో ధరల నిర్ణయంపై అధికారులు నియంత్రణ విధించారు. కనీస ధర రూ.2500, గరిష్ఠ ధర రూ.7000గా పరిమితి విధించారు. దీంతో మంగళవారం రూ.7000కు పైగా నిర్ణయించిన ధరలేవీ ఆన్‌లైన్‌లో నిక్షిప్తం కాలేదు. ఈ సమస్యను వ్యాపారులు, అధికారులు గమనించకపోవడంతో బిడ్‌ తెరిచేవరకు కూడా పొరపాటును గుర్తించలేకపోయారు. సమస్య గుర్తించేసరికి మధ్యాహ్నం 3 గంటలు కావడం, మరోసారి ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి వ్యాపారులు యత్నించడంతో మరింత ఆలస్యమవుతుందని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే బహిరంగ వేలంలో కొనుగోళ్లు జరపాలని రైతులు చేసిన డిమాండ్‌కు అధికారులు సమ్మతించారు.


రికార్డు ధర నమోదు

పెద్దపల్లి మార్కెట్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ వేలంలో పత్తి ధర క్వింటాలుకు గరిష్ఠంగా రూ.8000 పలికింది. మార్కెట్‌కు 916 క్వింటాళ్ల సరకు రాగా కనిష్ఠంగా రూ.6000, సగటు ధర రూ.7850 వరకు నమోదైంది. కాగా ఆన్‌లైన్‌ సమస్య పరిష్కారమయ్యే వరకు కొనుగోలు ప్రక్రియ బహిరంగ వేలం ద్వారానే నిర్వహిస్తామని జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని