రుణమేళాకు విశేష స్పందన
eenadu telugu news
Published : 27/10/2021 04:17 IST

రుణమేళాకు విశేష స్పందన

120 మంది లబ్ధిదారులు.. రూ.22.21 కోట్ల పంపిణీ

లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరిస్తున్న బ్యాంకర్లు

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడు క్షేత్ర స్థాయికి బ్యాంకు సేవలను తీసుకెళ్లేందుకు తొలిసారిగా ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నం ఫలించింది. మంగళవారం పెద్దపల్లిలో నిర్వహించిన రుణ మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లాలోని 14 బ్యాంకులకు సంబంధించి ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయగా సుమారు 300 మంది ఔత్సాహికులు హాజరయ్యారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు యువకులు ముందుకొచ్చారు. ఔత్సాహికులు పరిశ్రమలకు సంబంధించిన నమూనాలు, విద్యార్హత, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలించారు. ఆదాయాభివృద్ధిపై వారి ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. రుణం అవసరం ఎంత? దేనికి వినియోగిస్తారు? మార్కెటింగ్‌ వసతులు.. తదితర అంశాలను ఆరా తీశారు. అన్ని అర్హతలున్నవారికి అక్కడికక్కడే తాత్కాలిక రుణ మంజూరు పత్రాన్ని అందజేశారు. 120 మందికి రూ.22.21 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ చేగొండ వెంకటేశ్‌ తెలిపారు. మిగిలిన వారి ఆధారాలు పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అత్యధికంగా గృహ నిర్మాణ రుణాలు రూ.2.95 కోట్లు ఉండగా, పంట రుణాలు రూ.50 లక్షలు చొప్పున అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్‌, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సమ్మయ్య, యూబీఐ ఏజీఎం వంశీకృష్ణ, ఎస్బీఐ ఏజీఎం ఫణి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని