పిల్లలకు ఊపిరాడటం లేదు..
eenadu telugu news
Published : 27/10/2021 04:17 IST

పిల్లలకు ఊపిరాడటం లేదు..

పెరుగుతున్న శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు
కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీ వద్ద రద్దీ

వారం రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో పసిపిల్లల్లో న్యుమోనియా లక్షణాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వాతావరణంలో చలి పెరుగుతుండడంతో అత్యధిక పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి నిత్యం వచ్చే ఓపీలో సగానికి పైగా పసి పిల్లలకు సంబంధించినవే ఉంటున్నాయి. వ్యాధి తీవ్రత ఉన్నప్పటికీ ఆస్పత్రిలో అన్నివర్గాల వారికి ఒకే జనరల్‌ వార్డు ఉండడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించేందుకు ఇష్టం లేని చాలా మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

నవజాత శిశు సంరక్షణ కేంద్రం వద్ద పసిపిల్లలతో..

ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి

* వాతావరణంలో చలి తీవ్రత పెరుగుతున్నందున చిన్నపిల్లల్లో అత్యధికంగా జ్వరం, దగ్గుతో పాటు ఆయాసానికి గురవుతుంటారు.. ఏమాత్రం అజాగ్రత్త వహించినా వ్యాధి తీవ్రత పెరిగితే మరింత ప్రమాదకరమని వైద్యులు పేర్కొంటున్నారు.

* న్యుమోనియా లక్షణాలున్న వారు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుంటారు. శ్వాస తీసుకుంటున్నప్పుడు ఊపిరితిత్తుల ప్రాంతంలో సొట్టలు కనిపిస్తుంటాయి. ఊపిరితిత్తుల్లో నంజు చేరడంతో పిల్లలు మరీ ఇబ్బందులకు గురవుతుంటారు.

* సాధారణంగా రెండు నెలలలోపు పిల్లలు నిమిషానికి 60 సార్లు, ఏడాది లోపు పిల్లలు 50 సార్లు, ఐదేళ్లలోపు పిల్లలు 40 సార్లు, ఐదేళ్లకు మించిన పిల్లలు 30 సార్లు శ్వాస పీల్చుకుంటారు. ఇంతకంటే ఎక్కువ సార్లు శ్వాస పీల్చుకున్నారంటే వారిలో న్యుమోనియా లక్షణాలున్నట్లు భావించి వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* న్యుమోనియా తీవ్రత క్రమంగా పెరుగుతుండడంతో పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. తీవ్రతను బట్టి వైరల్‌ న్యుమోనియా, బ్యాక్టీరియల్‌ న్యుమోనియాగా గుర్తించి వైద్యులు చికిత్స చేస్తారు.

* పిల్లలకు చల్లని గాలి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వెచ్చగా ఉండే దుస్తులు వేయాలి. ద్విచక్రవాహనంపై పిల్లలను తీసుకెళ్తుంటే చల్లటి గాలికి పిల్లల్లో జ్వరం, దగ్గు, ఆయాసం తదితర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది.


వాతావరణ మార్పులతో..
-డాక్టర్‌ అదీష్‌రెడ్డి, పిల్లల వైద్య నిపుణులు, ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి

వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పిల్లల ఆరోగ్య పరిరక్షణకు తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం చలి తీవ్రత పెరుగుతున్నందున పిల్లలను చల్లని గాలికి, చలికి దూరంగా ఉంచాలి. వీలైనంత మేరకు చలి వేళల్లో బయట తిప్పకపోవడం ఉత్తమం.. పిల్లల్లో ఏమాత్రం అనారోగ్య సమస్యలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన వైద్యం ఇప్పించాలి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని