యజమానిని హతమార్చిన ట్రాక్టర్‌ డ్రైవర్‌
eenadu telugu news
Published : 27/10/2021 04:17 IST

యజమానిని హతమార్చిన ట్రాక్టర్‌ డ్రైవర్‌


నిందితులను చూపెడుతున్న డీఎస్పీ ఆర్‌.ప్రకాష్‌

గొల్లపల్లి, న్యూస్‌టుడే : మండలంలోని అగ్గిమల్లలో ఈ నెల 18న ట్రాక్టర్‌ యజమాని తడవేని వెంకటేష్‌ను అతని వద్ద పనిచేసే డ్రైవర్‌ కొలగాని రాజేందర్‌ మరో ఇద్దరితో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు డీఎస్పీ ఆర్‌.ప్రకాష్‌ తెలిపారు. గొల్లపల్లి ఠాణాలో మంగళవారం వివరాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. అగ్గిమల్లకు చెందిన కొలగాని రాజేందర్‌ అదే గ్రామానికి చెందిన తడవేని వెంకటేష్‌ వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటేష్‌కు రాజేందర్‌ భార్యతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కొద్దిరోజుల పాటు సెల్‌ఫోన్‌లో సంక్షిప్త సందేశాలు పంపించుకున్నారు. విషయం భర్త రాజేందర్‌కు తెలియడంతో పలుమార్లు హెచ్చరించాడు. వెంకటేష్‌ పద్ధతి మార్చుకోకుండా రెండు సార్లు ఆమెను ఇంటి నుంచి తీసుకెళ్లాడు. దీంతో తమ పరువు పోతోందని భావించిన రాజేందర్‌ తన బావలు కస్తూరి మల్లేష్‌, సల్లా రాజ్‌కుమార్‌ సలహా మేరకు వెంకటేష్‌ను హతమార్చాలని పథకం వేశాడు. గ్రామస్థుడైన కస్తూరి మల్లేష్‌, అతనికి బావ వరసైన అగుల అలియాస్‌ ఆవుల కిరణ్‌కుమార్‌ సాయం తీసుకొన్నాడు. ఈ నెల 18న అగ్గిమల్ల గ్రామ శివారులోని మామిడి తోట వద్దకు వెంకటేష్‌ను మాట్లాడుకుందామని పిలిచి రాజేందర్‌, మల్లేష్‌, కిరణ్‌కుమార్‌ పథకం ప్రకారం గొంతు కోసి హత్య చేశారు. ధర్మపురి సీఐ బిల్లా కోటేశ్వర్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన గొల్లపల్లి పోలీసులు అబ్బాపూర్‌ వద్ద  మంగళవారం వాహన తనిఖీ చేస్తుండగా పారిపోతున్న నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. కేసును త్వరగా ఛేదించిన సీఐ కోటేశ్వర్‌, ఎస్సై మనోహర్‌రావు, సిబ్బంది శంకర్‌, రమేష్‌, కిషోర్‌, విష్ణువర్ధన్‌, రమణాచారి, రాజశేఖర్‌, మల్లేష్‌, మహేష్‌లను జిల్లా ఎస్పీ సింధూశర్మ అభినందించినట్లుగా తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని