యువత.. సామాజిక తోవ
eenadu telugu news
Published : 27/10/2021 04:17 IST

యువత.. సామాజిక తోవ

రాయికల్‌, న్యూస్‌టుడే

హెల్మెట్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తున్న యువకులు

రాయికల్‌ మండలానికి చెందిన సుమారు 50 మంది యువకులు గత ఏడాదిగా శ్రీ రక్షా సేవా సమితి ఏర్పాటు చేసి పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాయికల్‌లో ఓ వైపు సామాజిక సేవతో పాటు మరో వైపు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించి ఆదర్శంగా నిలుస్తున్నారు. పట్టణానికి చెందిన సామల్ల సతీష్‌, మోర నరేష్‌, కొత్తపల్లి గంగాధర్‌, దాసరి హరిప్రసాద్‌, వాసం రాజేందర్‌, కట్టెకోల రామానందం, సింగని వేణు, వట్టిమల్ల సుధాకర్‌, కైరం శ్రీను, ఉడుత రాంసురేష్‌, కొడిమ్యాల రామకృష్ణ, మొసరపు సంతోష్‌తో పాటు పలువురు మిత్రులు నిత్యం తమ వృత్తిలో రాణిస్తూనే మిగిలిన సమయంలో సమాజ సేవకు ప్రాముఖ్యత కల్పిస్తున్నారు.

రాయికల్‌-రామాజిపేట రహదారిలో తరచూ ప్రమాదాలు జరిగి యువత మృతి చెందుతుండటంతో ప్రమాదాల నివారణకు సుమారు రూ.20 వేలతో ప్రమాద సూచికలు ఏర్పాటు చేయడంతో పాటు వాహనదారులకు ప్రమాద నివారణ చర్యలు, హెల్మెట్‌ వినియోగంపై కర పత్రాలు, గులాబీ పువ్వులతో అవగాహన కల్పించారు. కరోనా కాలంలో సేవలు అందించిన వారిని గుర్తించి సత్కరించి నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణంలో సుమారు రూ.10 వేలతో వార్డులలో నీరు నిలిచిన ప్రాంతంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. సుమారు 300 మంది యువత జాబితా సిద్ధం చేసి ఆపద సమయంలో రక్తం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.  


అందరి సహకారంతో..
సామల్ల సతీష్‌, ఆర్గనైజర్‌, శ్రీరక్షా సేవా సమితి

అందరి సహకారంతో పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తాం. మిత్రుల సహకారంతోనే గత ఏడాది పలు కార్యక్రమాలను నిర్వహించి విజయవంతం చేశారు. నిరుపేదలకు ఆర్థిక సాయం, కరోనా నివారణ చర్యలు తదితర అంశాలపై సాయం అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం.


శతశాతం వ్యాక్సిన్‌కు అవగాహన
-నరేష్‌, కోశాధికారి

కరోనా కేసులు తగ్గడంతో ప్రజలు వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో వేసుకోవడం లేదు. గ్రామాల్లో శతశాతం వ్యాక్సిన్‌ వేసేలా అవగాహన కల్పిస్తాం. యువత అత్యవసర సమయంలో రక్తదానం, సమాజ సేవకు ముందుకు రావాలి.  


విద్యార్థులకు సదస్సులు
గంగాధర్‌, అధ్యక్షుడు

సామాజిక సేవతో పాటు కరోనా కాలంలో ఇంటికే పరిమితమైన విద్యార్థులలో మానసిక ఒత్తిడి తగ్గించి ఏకాగ్రత, సృజనాత్మకత పెంచడానికి ప్రత్యేకంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. మిత్రులు, యువత సహకారంతో శ్రీరక్షా సేవా సమితి ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపాడతాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని