మంత్రాల నెపంతో వృద్ధుడి హత్య
eenadu telugu news
Published : 27/10/2021 04:35 IST

మంత్రాల నెపంతో వృద్ధుడి హత్య


మృతి చెందిన బొజ్జ నర్సయ్య

కొడిమ్యాల, న్యూస్‌టుడే : మంత్రాల నెపంతో బొజ్జ నర్సయ్య (72) అనే వృద్ధుడిని గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చిన సంఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం సూరంపేట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సూరంపేట గ్రామానికి చెందిన బొజ్జ నర్సయ్య-లస్మవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలుండగా వారందిరికీ వివాహాలయ్యాయి. ఇద్దరు కొడుకులు ప్రస్తుతం ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటుండగా నర్సయ్య గ్రామంలో వ్యవసాయ, ఇతర కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే గ్రామానికి చెందిన నర్సయ్య బావమరిది కుమారుడైన పిట్టల సుమన్‌కు పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వచ్చినవారు వెనక్కి వెళ్లిపోతున్నారు. దీంతో పెళ్లి సంబంధాలు కుదరకపోవడానికి కారణం నర్సయ్య మంత్రాలు చేయడమేనని సుమన్‌ పలుమార్లు ఆయనతో గొడవలు పడ్డాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నర్సయ్య కూలీ పనికి బయలుదేరగా గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో వెనకనుంచి వచ్చిన సుమన్‌ గొడ్డలితో నర్సయ్యపై దాడి చేసి మృతదేహాన్ని మురుగు కాల్వలోకి తోశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై నర్సయ్య అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. మల్యాల సీఐ రమణమూర్తి ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడు సుమన్‌ పరారీలో ఉండగా మృతుని భార్య లస్మవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని