తగ్గిన చోటే.. తగిన దృష్టి
eenadu telugu news
Published : 27/10/2021 04:35 IST

తగ్గిన చోటే.. తగిన దృష్టి

ఓటు ప్రాధాన్యంపై చైతన్య కార్యక్రమాలు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

న్యూస్‌టుడే- హుజూరాబాద్‌

ప ఎన్నికల పుణ్యమా అని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఎటు చూసినా రాజకీయ కోలాహలమే కనిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ఓటు అనే ఆయుధాన్ని అందరూ వినియోగించుకోవాలనే చైతన్యాన్ని ఓటర్లలో నింపే ప్రయత్నాల్ని చేస్తున్నారు.

* 2018లో హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో చాలాచోట్ల 70 శాతంలోపు పోలింగ్‌ జరిగింది. అత్యల్పంగా జమ్మికుంట పట్టణంలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో 63శాతం నమోదైంది. హుజూరాబాద్‌ పురపాలికలోని 5 పోలింగ్‌ బూత్‌లలోనూ 70 శాతాన్ని మించేలా ఓటర్లు ఓటు పట్ల ఆసక్తిని చూపించలేకపోయారు. దీంతో ఈ ఉప ఎన్నికల్లో గతంలో తగ్గిన కేంద్రాలను గుర్తించి అక్కడే ప్రత్యేక అవగాహన కార్యాక్రమాల్ని బీఎల్వోలు నిర్వహిస్తున్నారు. ఫ్లెక్సీల ఏర్పాటు సహా ప్రత్యేక కరపత్రాల పంపిణీలతో ఓటు దిశగా ప్రజలు కదిలే ప్రయత్నాల్ని చేస్తున్నారు. ఇందుకోసం పలు యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారాల్ని తీసుకుంటున్నారు. ఓటు ఎలా వేయాలనే విషయమై ఓటర్ల వద్దకు వెళ్లి నమూనా ఈవీఎంలతో అవగాహన కల్పిస్తున్నారు.

స్ఫూర్తిని చాటిన పల్లెలిలా..
నియోజకవర్గంలోని కొన్ని పల్లెలు అనూహ్య స్ఫూర్తిని గత ఎన్నికల్లో పోలింగ్‌ పరంగా చాటాయి. 279 పోలింగ్‌ కేంద్రాల్లో 21 చోట్ల 90 శాతాన్ని మించిన పోలింగ్‌ జరిగింది. గత ఎన్నికల్లో 2.09లక్షల ఓటర్లకుగానూ 1.75లక్షల మంది ఓటు హక్కుని వినియోగించుకోగా 84శాతం పోలింగ్‌ నమోదైంది. ఇందులో ఈగ్రామాలే శతశాతం పయనించేలా స్ఫూర్తిని పెంపొందించుకున్నాయి. 85 శాతాన్ని దాటిన గ్రామాలు 40 వరకుండటం గమనార్హం. ఈసారి ఆయా పార్టీలు ప్రచారాన్ని హోరాహోరీగా తీసుకుని ఓటర్లను పోలింగ్‌ కేంద్రాల వైపునకు తీసుకెళ్లేలా చైతన్యపరుస్తుండటంతోపాటు అధికారులు కూడా అవగాహనల్ని పెంచడంతో నియోజకవర్గంలో 90శాతం పోలింగ్‌ జరుగుతుందనే అంచనా కలుగుతోంది.

విశ్లేషిస్తూ.. మార్పు దిశగా..
ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఇటీవలే ఎన్నికల సంఘం కూడా జిల్లా యంత్రాంగానికి దృశ్యసమీక్షలో ఆదేశాలిచ్చింది. దీంతో పెరిగిన ఓట్లకు తగినట్లుగా పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను పెంచారు. ఇదే సమయంలో గతంలో నమోదైన ఆయా ఎన్నికల్లోని విశ్లేషణల్ని గమనిస్తూ వాటికి గల కారణాల్ని యంత్రాంగం తెలుసుకుంటోంది. ఈసారి ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో కచ్చితంగా 90శాతానికి పైగా పోలింగ్‌ జరిగేలా చూడాలని ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది.

పెరిగే అవకాశం..
గతంలో ఎన్నడు లేనివిధంగా ఇక్కడి పోరు ఆసక్తికరంగా మారడం, రాజకీయ చైతన్యం ఊహించని విధంగా పెరగడంతో ఆయా పార్టీలు కూడా పోలింగ్‌ శాతాన్ని పెంచితేనే తమకు ప్రయోజనమనే పంథాలో ముందుకెళ్తున్నాయి. మరోవైపు కొత్త ఓటర్లు కూడా 17 వేల వరకు పెరగడంతో వారంతా తమ హక్కును ఉత్సాహంతో కచ్చితంగా వినియోగించుకునే అవకాశం ఉండనుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని