రాజసంగా.. నిష్క్రమణ 
eenadu telugu news
Published : 27/07/2021 04:12 IST

రాజసంగా.. నిష్క్రమణ 

వెళ్లివస్తా.. : రాజ్‌భవన్‌లో రాజీనామా పత్రం సమర్పించి వస్తున్న అప్ప

 

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : రాష్ట్రాన్ని కుదిపేసిన రాజకీయ ఉత్కంఠకు సోమవారం తెరపడింది. యడియూరప్ప నాయకత్వంలో నాలుగోసారి ఏర్పాటైన భాజపా సర్కారు రెండేళ్లతో పని ముగించుకుని వెనుతిరిగింది. రాష్ట్రం కొత్త నాయకుడి కోసం ఎదురుచూస్తోంది. భాజపా రాష్ట్ర- జాతీయ నేతల సమష్టి ప్రణాళికతో ఎట్టకేలకు పార్టీ పెద్ద దిక్కును పక్కన కూర్చోబెట్టారు. కరోనా చుట్టుముట్టకుండా ఉంటే.. నాయకత్వ మార్పు మరింత ముందే జరిగి ఉండేదని భాజపా ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించటం గమనార్హం. రెండేళ్లుగా అటు లాక్‌డౌన్‌ సడలించగానే ఇటు నాయకుడి మార్పు నినాదం తెరపైకి వస్తూ రాజకీయ అస్థిరతకు తావిచ్చింది. తనపై వస్తున్న ఆరోపణలను నిశ్శబ్దంగానే గమనించిన యడియూరప్ప చివరకు తన నోటి నుంచే తన నిర్ణయాన్ని ప్రకటించారు.

గవర్నర్‌కు రాజీనామా పత్రం సమర్పిస్తున్న యడియూరప్ప

చిత్రాలే చెప్పాయి..

రాజీనామాపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నా ఏనాడూ యడియూరప్ప నోరు మెదపలేదు. ఎప్పటికప్పుడు సంయమనంతో సమాధానమిచ్చారు. ఈ నెల 16న దిల్లీ పర్యటనతో రాజీనామా వదంతులకు కాస్త బలం చేకూర్చారు. దిల్లీ పర్యటనకు తన ఇద్దరు కుమారులతో వెళ్లిన ముఖ్యమంత్రి కీలకంగా స్పందించారు. బిడ్డల భవిష్యత్తుకు భరోసా పొందేందుకే దిల్లీకి వెళ్లినట్లు రాజకీయ పండితుల విశ్లేషణ. ఆపై పది రోజుల పాటు రాష్ట్ర ప్రజలను అయోమయంలో పడేశారు. గతంలో ఎప్పుడు దిల్లీకి వెళ్లినా ఇంతగా చర్చ సాగేది కాదు. ఈ రెండేళ్లలో మూడుసార్లు దిల్లీకి వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి ప్రధాని, అమిత్‌ షాలతో కలిసిన దాఖలాలు తక్కువే. ఈనెల 16న దిల్లీ పర్యటనలో పార్టీ కీలక నేతలు ముగ్గురితోనూ కలిసి రావడం ఆశ్చర్యపరిచింది. తనతో భేటీ అయిన ముఖ్యమంత్రుల ఛాయా చిత్రాలను ఎన్నడూ ప్రధాని కార్యాలయం సామాజిక మాధ్యమంలో ప్రచురించదు. యడియూరప్పతో మోదీ సమావేశ చిత్రాలను ఆయా పెద్దల అధికారిక ట్విట్టర్‌ వేదికల్లో ఉంచారు. బహుశ యడియూరప్ప అధికారిక హోదాలో చేస్తున్న చివరి భేటీ కావడంతోనే వారంతా ట్విట్టర్‌లో పంచుకున్నారని జాతీయ మాధ్యమాలు విశ్లేషించాయి.

నిర్ధారించిన కన్నీరు

దిల్లీ పర్యటన తర్వాత బెంగళూరుకు వచ్చిన యడియూరప్ప ఏనాడూ రాజీనామాపై స్పష్టత ఇవ్వలేదు. తాను ఇంకా అధిష్ఠానం నుంచి సమాచారం కోసం వేచి చూస్తానని సర్దిచెబుతూ వచ్చారు. ఆదివారం వరకు ఆయన ఎదురు చూసింది మరికొద్ది రోజులు కొనసాగమన్న భరోసా కోసమని ఎవరికీ తెలియలేదు. ఆదివారం బెళగావి పర్యటనలోనూ దిల్లీ నుంచి సమాచారం రాలేదు. అధిష్ఠానంతో చర్చల సారం ఎవరికీ తెలియలేదంటే యడియూరప్ప ఎంత నాటకీయంగా వ్యవహరించారో తెలుస్తుంది. చివరకు తన కుటుంబ సభ్యులకూ రాజీనామా చేస్తున్నానని తెలియనీయలేదని కుమార్తె అరుణాదేవి చెప్పటం గమనార్హం. సోమవారం ఉదయం 10:30 గంటలకు విధానసౌధ బాంక్వెట్‌ సభాంగణంలో ఏర్పాటైన సర్కారు విజయోత్సవ సభా వేదికపై కూర్చున్న యడియూరప్ప ఎంతో నిబ్బరంగా కనిపించారు. అప్పటి వరకు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఆయన ప్రసంగ సమయం రానే వచ్చింది. తాను శికారిపుర పట్టణం నుంచి ప్రారంభించిన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ ఒక్కసారి గద్గద స్వరంతో మాట తడబ్డారు. ఆపై జారిన కన్నీళ్లే యడియూరప్ప రాజీనామాను నిర్ధారించాయి. అర్ధశతాబ్ద రాజకీయ ప్రస్థానంలో ఏనాడూ కన్నీరు పెట్టని యడియూరప్పను చూసి ఆయన బద్ధ శత్రువుల కళ్లు కూడా చమర్చాయి. ముఖ్యమంత్రి స్థానంలో మరింత కాలం కొనసాగుతానన్న భరోసా దొరికి ఉంటే కన్నీరు పెట్టేవారు కాదని ఆ క్షణంలోనే రాష్ట్ర ప్రజలు నిర్ధారణకు వచ్చారు.

ముఖ్యమంత్రి పీఠాన్ని ఖాళీ చేసిన యడియూరప్ప

ఎన్నికలకు సిద్ధమా?

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యడియూరప్పను తొలగించి, మరొక నేతను ముఖ్యమంత్రిగా నియమిస్తే ప్రజలకు ప్రయోజనమేంటి? తక్షణమే విధానసభను రద్దు చేసి ఎన్నికల పరుగులో మాతో తలపడాలి.-హుబ్బళ్లిలో కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య

కన్నీటికి కారణమెవరు?

ముఖ్యమంత్రి స్థానానికి రాజీనామా చేసిన సందర్భంలో యడియూరప్ప కంట తడిపెట్టడానికి కారణమెవరు? భాజపా నేతలు బదులివ్వగలరా? ఆ బాధకు కారకులెవ్వరో యడియూరప్ప వెల్లడించాలి. సొంత పార్టీ నాయకులే ఆయనకు వెన్నుపోటు పొడిచారు. కర్ణాటకలో భాజపాను అధికారంలోకి తీసుకు వచ్చిన నాయకుడిని వంచించారు.-శివకుమార్‌ పీసీసీ అధ్యక్షుడు

ఇచ్చిన మాటకోసమే..

పార్టీ అధిష్ఠానానికి ఇచ్చిన మాటకు అనుగుణంగా రెండేళ్ల పాలన అనంతరం యడియూరప్ప రాజీనామా చేశారు. అధికారాన్ని పట్టుకుని ఆయన ఎన్నడూ వేలాడలేదు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆయన అమలు చేసిన పథకాలను ఎవరూ మర్చిపోరు.-బసవరాజ బొమ్మై, భాజపా

రెండేళ్ల సాధన నాస్తీ

రెండేళ్లలో ఈ భాజపా సర్కారు సాధన ఏమీలేదు. కరోనా.. కరవు.. వరద పరిస్థితులను ఎదుర్కోలేక పోయింది. ప్రత్యేక ప్యాకేజీలు అర్హులకు అందలేదు. అవినీతిపై బహిరంగ చర్చలు అందరికీ తెలిసినవే. భాజపా ఎమ్మెల్యేల నియోజకవర్గాలకే అంతా మేలు చేశారు.-హెచ్‌.కె.కుమారస్వామి, జేడీఎస్‌

అయ్యో.. పాపం అనిపించింది

ముఖ్యమంత్రి స్థానానికి యడియూరప్ప రాజీనామా చేయడం బాధనిపించింది. యడియూరప్పపై నాకు చాలా గౌరవం. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. ఆ సత్యమే విశ్వసిస్తాను.-లక్ష్మీ హెబ్బాళ్కర్‌, ఎమ్మెల్యే-న్యూస్‌టుడే, సదాశివనగర

సాధనలివిగో : రెండేళ్ల పాలనపై పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న నేతలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని