Crime News: విషాద.. విషబీజం
eenadu telugu news
Updated : 19/10/2021 11:38 IST

Crime News: విషాద.. విషబీజం

చిత్రదుర్గం(కర్ణాటక), న్యూస్‌టుడే : ఆ బాలికలో మొగ్గతొడిగిన ద్వేషం.. ఓ కుటుంబాన్ని నిలువునా కూల్చింది. కళ్లెదుటే కన్నవారు, తోబుట్టు విలవిలలాడుతూ ఊపిరి వదులుతున్నా పంటి బిగువన వాస్తవాన్ని దాచిన ఆమె వాస్తవాన్ని ఎన్నో రోజులు దాచలేక పోయింది. చిన్నవారైన తమ్ముడు, చెల్లికి ఇస్తున్న ప్రాధాన్యం.. పెద్ద సంతానంగా తనకు ఈ తల్లిదండ్రులు ఎందుకివ్వరనే ఉడుకుమోతుతనం ఉగ్రరూపమే దాల్చింది. ఆ రూపం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే.. మనం జులై 13వ తేదీ పుటను ఓసారి తిప్పేయాలి. ఆ రోజు.. కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలోని భరమసాగర ఠాణా ఇస్సాముద్ర గ్రామంలో తిప్పానాయక్‌ ఇంట రాత్రి భోజనానికి కుటుంబ సభ్యులంతా కూర్చున్నారు. అందరికీ ఇష్టమైన రాగి సంగటి వేడివేడిగా సిద్ధమైంది. దాన్ని ఆరగించిన కాసేపటికే.. తీవ్రమైన విరేచనాలు, వాంతులతో కుటుంబ సభ్యులు విలవిలలాడారు. బాలిక తండ్రి తిప్పానాయక్‌ (45), తల్లి సుధాబాయి(40), నాయనమ్మ గుండిబాయి (80) చెల్లి రమ్య (15) నెత్తురు కక్కుతూ నేలవాలారు. ఆమె సోదరుడు రాహుల్‌ను ఆస్పత్రిలో చేర్పించాక.. ఇటీవలే కోలుకున్నాడు. నాటి ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. వారు ఆరగించిన ఆహార నమూనాలను రసాయన పరీక్షలకు పంపిన పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ఆ రసాయన పరీక్షల వివరాలు అధికారుల చేతికందాయి. ఆహారంలో విషం కలిపారని తేలింది. ‘ఇక్కడే మాకు అనుమానం మొదలైంది. ఆ ఇంట అందరూ ఆహారాన్ని ఆరగించినా.. ఆ బాలిక (17) మాత్రం ఎందుకు తినలేదనే ప్రశ్న మమ్మల్ని తొలిచేసింది. బాలిక విషయంలో ఒత్తిడి తేకుండా క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించాం. ఆమె నడక భిన్నంగా ఉండడం.. విపరీత తత్తరపాటు గుర్తించాం. ఏదో తప్పుచేసిన భావన ఆమెలో కనిపించింది. గట్టిగానే నిలదీశాం. వాస్తవాలు కక్కేసింది. చేసిన తప్పు ఒప్పుకుంది’ అని చిత్రదుర్గం ఎస్పీ రాధిక నాటి ఘటన వెనుక ఉన్న వ్యక్తి వివరాలను సోమవారం వెల్లడించారు. ‘నిజమే.. నేనే ఆ పని చేశా. ఆ ఇంట్లో నేను పెద్దదాన్ని. నాకన్నా ఇద్దరు చిన్నవారున్నా.. వారికి ఏ పనీ చెప్పరు. అన్నింట్లోనూ వారికే ప్రాధాన్యం. నన్ను మాత్రం కూలి పనులకు పంపడం అన్యాయం కాదా? పెద్దల ప్రేమ నాకు దూరమవుతోందనే బాధ కలిగింది. అందుకే.. రాగి సంగటి తయారు చేసే సమయంలోనే విషం కలిపా. ప్రీతి, వాత్సల్యం నాకు దక్కనప్పుడు వారు నాకెందుకు అనే బాధ వెంటాడింది’ అంటూ ఆ బాలిక తప్పు ఒప్పుకొన్నట్లు ఎస్పీ వివరించారు. సోమవారం ఆ బాలికను ప్రభుత్వ సంరక్షణ శాలకు తరలించామని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని