వెండి తెరకు పైరసీ చీడ
eenadu telugu news
Published : 20/10/2021 01:48 IST

వెండి తెరకు పైరసీ చీడ


సమస్యలు విన్నవించేవేళ.. హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను సత్కరించిన సినీ ప్రముఖులు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడేే : పైరసీని అడ్డుకునేందుకు కఠిన చట్టాలు రూపొందిస్తామని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర సినీరంగ ప్రముఖులకు హామీనిచ్చారు. కన్నడ సినిమాలు, పాటలు పైరసీ బారిన పడకుండా కఠిన చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. కర్ణాటక వాణిజ్య చలనచిత్ర మండలి మంగళవారం బెంగళూరులో నిర్వహించిన సమావేశంలో ప్రతినిధులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. చిత్రీకరణ నుంచి సినిమా విడుదలయ్యే వరకు నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యాజమాన్యాలు ఎదుర్కొనే సమస్యలను అర్థం చేసుకున్నామని చెప్పారు. పైరసీకి పాల్పడేవారిపై చర్యలు తీసుకునేందుకు సైబర్‌ పోలీసుల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. చిత్రీకరణకు వస్తున్న కన్నడ దర్శకులు, నిర్మాతలను ఇబ్బంది పెట్టవద్దని నగర పోలీసు కమిషనర్‌, పోలీసు డైరెక్టర్‌ జనరల్‌కు సమావేశం మధ్యలోనే ఫోన్‌ చేసి సూచనలు చేశారు. మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ల ధరలను రూ.200కు పరిమితం చేయడం, అన్ని థియేటర్లలో ప్రదర్శనలకు అనుమతులు ఇవ్వాలని మండలి ప్రతినిధులు వినతిపత్రాన్ని అందించారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎవరైనా శిక్ష అనుభవించాలని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర హెచ్చరించారు. ఆయన మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ కొన్ని చోట్ల నైతికత పేరిట పోలీసుగిరి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని చెప్పారు. బెంగళూరులో ఇలాంటి పోలీసుగిరికి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేశామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని