ఏనుగుల శిబిరంలో ఒక రోజు!
eenadu telugu news
Published : 20/10/2021 01:48 IST

ఏనుగుల శిబిరంలో ఒక రోజు!

బాహ్య ప్రపంచానికి పరిచయం లేని శిక్షణ


వరుస క్రమంలో నిలుచున్న ఏనుగులు

చామరాజనగర, న్యూస్‌టుడే : అటవీ శిబిరాల్లో ఏనుగులు ఎలా తమ రోజును గడుపుతుంటాయి? రాష్ట్రంలో ఎనిమిది ఏనుగుల శిబిరాలుండగా.. దుబారె, సక్రెబైలు తదితర ఒకటి రెండు శిబిరాల్ని మాత్రమే సందర్శకులు చూసేందుకు వీలుంటుంది. బండీపుర అభయారణ్యంలోని ఐనూరు మారిగుడి జోన్‌లోని రామపుర శిబిరం ఎంతో ప్రత్యేకమైంది. కనీసం అటువైపు కన్నెత్తికూడా చూసేందుకు అటవీశాఖ అవకాశం కల్పించదు. దట్టమైన అడవుల నడుమ నెలకొన్న రామపుర శిబిరంపై ‘రామపుర దిగ్గజరు’ పేరుతో ఓ లఘు చిత్రాన్ని అటవీశాఖ రూపొందించి బాహ్య ప్రపంచానికి పరిచయం చేసింది. ఇతర శిబిరాలతో పోలిస్తే రామపుర శిబిరం పూర్తిగా భిన్నమైందని అటవీ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతానికి ఏ ఒక్కరినీ అనుమతించరు. ఆ ఏనుగుల శిబిరంలో ఒకరోజు.... ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందామా!

రాత్రి అడవుల్లోకి వదిలిన ఏనుగులను తిరిగి శిబిరానికి తీసుకొచ్చేందుకు మావటీలు, సహాయకులు ఉదయమే పయనమవుతారు. ముందురోజు సాయంత్రం ఎక్కడ వాటిని వదిలిపెట్టారో అక్కడి నుంచే వాటి కోసం గాలింపు ఆరంభమవుతుంది. మెడకు గంట, పొడవాటి గొలుసుతో ఏనుగులను అడవుల్లోకి వదిలిపెట్టడంతో ఆ శబ్దాన్ని అనుసరించి ఏనుగులను గుర్తిస్తారు. ఉదయాన్నే తమ మావటీలు, సహాయకుడిని చూడగానే ఏనుగులు వారి వెంటనే బయలుదేరతాయి. కొన్ని సందర్భాల్లో తిరిగి శిబిరానికి చేరుకునేందుకు మొరాయిస్తుంటాయని మావటీలు వెల్లడించారు. ఇలా అడవుల్లోకి వదిలిపెట్టిన సమయంలోనే దుబారె శిబిరంలో కుశ అనే ఏనుగు ఏకంగా ఏడాదిన్నర కాలంపాటు అడవి ఏనుగులతోనే సంచరించిన విషయం గుర్తుండే ఉంటుంది. రామపుర శిబిరంలో పది ఏనుగులున్నాయి. సమీపంలోని నూగు నదిలో వాటిని ప్రతీరోజూ ఉదయం శుభ్రం చేస్తారు. ఆ తరువాత శిరస్సు చల్లగా ఉండేలా వేపనూనెను తలకు రాస్తారు. గొలుసుల్ని కట్టడడం వల్ల కాళ్లకు గాయాలు నయమయ్యేందుకు కాళ్ల చుట్టూ వేపనూనెను పూస్తారు. గతంలో శిబిరాల్లోని ఏనుగులతో కలప దుంగల్ని తరలించే పనులు చేయించేవారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల తరువాత వాటికి అలాంటి భారీ పనులు చేయించడాన్ని నిలిపివేశారు. నూగు నదిలో స్నానానంతరం ఏనుగులు అప్పటికే సిద్ధం చేసిన మర్రి ఆకులతో శిబిరానికి బయలుదేరతాయి. మధ్యాహ్నానంతరం ఏనుగులకు వివిధ విన్యాసాల గురించి శిక్షణనిస్తారు. పులిని బంధించాల్సిన సమయంలో అనుసరించాల్సిన వ్యూహం, మావటీలతో ఎలా ఉండాలో వాటికిశిక్షణనిస్తారు. రామపుర శిబిరం సమీపంలో 20 కిలోమీటర్ల పొడవునా కేరళ రాష్ట్ర సరిహద్దులున్నాయి. పులుల బెడద సందర్భాల్లో ఏనుగుల సేవల్ని వినియోగిస్తారు. సాయంత్రం ఏనుగులను తిరిగి అడవుల్లోకి వదిలిపెట్టడంతో ఆరోజు కార్యక్రమం ముగుస్తుంది.

వివిధ భంగిమల్లో శిక్షణ


పులి ఎదురుపడితే ఎలా ఆటకట్టించాలో శిక్షణనిస్తున్న మావటీలు

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని