చెరకు రైతులకు చేదు అనుభవాలు
eenadu telugu news
Published : 20/10/2021 01:48 IST

చెరకు రైతులకు చేదు అనుభవాలు


పొలంలో చెరకు నరుకుతున్న మహిళా కూలీలు

హొసపేటె, న్యూస్‌టుడే: హొసపేటె చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరకు పండించే రైతులు చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నారు. ఐదేళ్ల నుంచి హొసపేటె(చిత్తవాడ్గీ)లోని చక్కెర మిల్లు నష్టాల్లో కూరుకుపోయి మూతపడటంతో చెరకు పండించిన రైతులు ఎగుమతి కోసం నానా తంటాలు పడుతున్నారు. మూతపడిన ఐఎస్‌ఆర్‌ చక్కెర మిల్లు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు సన్నగిల్లడంతో రైతులు గత్యంతరం లేక దూరప్రాంతాలకు చెరకు ఎగుమతి చేసి నష్టపోతున్నారు. హొసపేటె, కమలాపుర, మరియమ్మన హళ్లి ఫిర్కాల్లో కలిపి సుమారు 9 వేల ఎకరాల్లో రైతులు చెరకు పండిస్తున్నారు. ఇక్కడ పండించిన చెరకును హరపనహళ్లి తాలూకా దుగ్గావతి, హూవిన హడగలి తాలూకా మైలార, సిరుగుప్ప, గదగ జిల్లా ముండరిగికి ఎగుమతి చేస్తున్నారు. సన్నకారు రైతులు తప్పని పరిస్థితుల్లో చెరకును బెల్లం గానుగకు తరలిస్తున్నారు. ఇప్పటికే తాలూకా వ్యాప్తంగా మూడు ఫిర్కాల్లో చెరకు నరికే పనులు వేగవంతమయ్యాయి. ఎగుమతి సమస్య రైతులను పట్టి పీడిస్తోంది. పొరుగు ప్రాంతాల చక్కెర మిల్లులవారు టన్నుకు రూ.2,500 ధర నిర్ధరించారు. పొలంలో చెరకు నరికి దానిని ఎడ్లబళ్లలో పొలం నుంచి ప్రధాన రహదారికి తీసుకొచ్చి, అక్కడ లారీల్లో లోడు చేయాలి. ఎకరానికి రూ.50 వేల దాకా పెట్టుబడి పెట్టినా, అన్ని ఖర్చులు పోను ఎకరానికి రూ.10 వేలు మిగలడమే గగనమని రైతులు వాపోతున్నారు. స్థానికంగా చక్కెర మిల్లు నడిచే సమయంలో లాభాలు చవిచూసేవాళ్లం. ఇప్పుడు పెట్టుబడి దక్కించుకుంటే చాలునన్న పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాల్లో కూరుకుపోయిన మండ్య మై షుగర్స్‌ను ప్రభుత్వం ఆదుకోవటానికి ముందుకు వచ్చింది. అదే విధంగా ఇక్కడి ఐఎస్‌ఆర్‌ చక్కెర మిల్లును కూడా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

కమలాపురలో లారీలో చెరకును లోడు చేస్తున్న రైతులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని