‘క్యాంటీన్లు రాజకీయ లబ్ధికోసం కాదు’
eenadu telugu news
Published : 20/10/2021 01:48 IST

‘క్యాంటీన్లు రాజకీయ లబ్ధికోసం కాదు’కార్యకర్తలు, నాయకులతో కలిసి బళ్లారిలో ప్రదర్శన

బళ్లారి, న్యూస్‌టుడే: ‘‘కొవిడ్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు, విద్యార్థులు, హమాలీలకు ఉచితంగా భోజనం సమకూర్చాలనే ఉద్దేశంతో తమ ట్రస్ట్‌ ద్వారా క్యాంటీన్లు ప్రారంభించాను. దీనికి రాజకీయ సంబంధాలు అంటగట్టడం సరికాదు. రాబోయే విధానసభ ఎన్నికల్లో కలఘటగి విధాన స్థానం నుంచే పోటీ చేస్తా’’నని మాజీ మంత్రి సంతోష్‌ లాడ్‌ స్పష్టం చేశారు. బళ్లారి ఎ.పి.ఎం.సి. మార్కెట్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత భోజన క్యాంటీన్‌ను డీసీసీ అర్బన్‌ విభాగం అధ్యక్షుడు మహ్మద్‌ రఫీక్‌తో కలిసి మంగళవారం ప్రారంభించిన సంతోష్‌ లాడ్‌ అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన కలఘటగి క్షేత్రంలో తొలుత క్యాంటీన్లు ప్రారంభించాం. అనంతరమే బళ్లారి జిల్లాలో తెరిచినట్లు పేర్కొన్నారు. సండూరు, కూడ్లిగి, హరపనహళ్లి తాలూకాల్లో కలిపి 13 క్యాంటీన్ల ద్వారా ఉచితంగా భోజనం సమకూరుస్తున్నట్లు తెలిపారు. రోజూ 12 వేల నుంచి 15 వేల మంది ప్రయోజనం పొందుతున్నారని, ఇంతవరకు సుమారు 10 లక్షల మంది ఆకలి తీర్చినట్లు వివరించారు. బళ్లారి గ్రామీణ క్షేత్రంలోనూ క్యాంటీన్‌ ప్రారంభించే ఆలోచన ఉందన్నారు.

కలఘటగిలో ఉచిత ఆరోగ్య సేవలు

బళ్లారి జిల్లాలో రిజర్వేషన్‌ కారణంగా పోటీ చేసే అవకాశం లేకపోవడంతో కలఘటిగి ప్రజలు రాజకీయ జీవితం ప్రసాదించారు. గత ఎన్నికల్లో అక్కడ ఓటమి చవిచూసినా, నెలలో 15 రోజులు క్షేత్ర ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు సంతోష్‌లాడ్‌ పేర్కొన్నారు. సోనియా, ప్రియాంక, రాహుల్‌గాంధీల పేరిట మూడు అంబులెన్సులు సమకూర్చి 15 గ్రామాల్లో అవసరమైనవారికి ఉచితంగా వీటిని అందుబాటులో ఉంచానన్నారు. గ్రామాల్లో ఉచిత చికిత్సలు చేయించి, ఔషధాలను అందజేస్తున్నాం. అంబులెన్స్‌లోనే ల్యాబ్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎం.బి.బి.ఎస్‌. వైద్యుడు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు.

‘దళితులకు ఎమ్మెల్సీ టిక్కెట్‌ ఇవ్వాలని కోరాం’

డిసెంబరులో జరిగే విధానపరిషత్తు ఎన్నికల్లో దళితులకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సంతోష్‌లాడ్‌ తెలిపారు. ఈ ప్రాంతంలో దళిత సముదాయం ఎక్కువగా ఉన్నందున వారికి టికెట్‌ ఇస్తే న్యాయం చేసినట్లవుతుందన్నారు. పార్టీ అధిష్ఠానం ఎవరికి టికెట్‌ ఇచ్చినా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో హనగల్‌ విధానసభ నియోజకవర్గాల్లో ఓ జిల్లా పంచాయతీ క్షేత్రం బాధ్యతలు తనకు అప్పగించారు. ప్రచారంలో ఓటర్ల నుంచి కాంగ్రెస్‌కు విశేష స్పందన వస్తున్నట్లు సంతోష్‌ లాడ్‌ తెలిపారు. భాజపా నేతలు డబ్బుపై మాత్రమే ఆశలు పెట్టుకున్నారని ఆరోపించారు. సంతోష్‌ లాడ్‌కు బళ్లారిలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. కంటోన్మెంట్‌ నుంచి హెచ్‌.ఆర్‌.గవియప్ప కూడలి మీదుగా మార్కెట్‌కు బైక్‌ ర్యాలీగా వచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముండ్రిగి నాగరాజు, మానయ్య, గుర్రం వెంకటరమణ, సుబ్బరాయుడు, పేరం వివేక్‌, కుమారమ్మ, నెహ విల్సన్‌, తాయప్ప, బి.ఎం.పాటిల్‌, నాగరాజు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

చిత్రాన్నం వడ్డిస్తున్న సంతోష్‌లాడ్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని