అక్షయపాత్ర..ఘుమఘుమలు !
eenadu telugu news
Updated : 22/10/2021 01:12 IST

అక్షయపాత్ర..ఘుమఘుమలు !


పాకశాలలో పాత్రల్లోకి నింపుతున్న ఆహారం

(ఈనాడు డిజిటల్‌, బెంగళూరు న్యూస్‌టుడే, మల్లేశ్వరం): ప్రాథమిక పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొంది. గురువారం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు భౌతిక బోధన ప్రారంభమైంది. అదే సందర్భంగా మధ్యాహ్న భోజన పథకాన్ని సర్కారు ప్రారంభించింది. కరోనా నిబంధనలు పాక్షికంగా అమలు చేస్తూ అన్ని స్థాయిల తరగతులు మొదలయ్యాయి.. ప్రాథమిక స్థాయి తరగతుల నిర్వహణకు కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. ఉపాధ్యాయుల వ్యవస్థాగత డిమాండ్లతో పాటు మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలు భౌతిక తరగతుల నిర్వహణకు అడ్డుగా నిలిచాయి.

l విద్యాశాఖ మంత్రి బి.సి.నాగేశ్‌ గురువారం మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. తన సొంత నియోజకవర్గం తిపటూరులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆయన మధ్యాహ్న భోజనాన్ని అందించారు. విద్యార్థులకు పాయసం, అన్నాన్ని స్వయంగా సమకూర్చారు. నిత్యం మధ్యాహ్న భోజనం ఇంతే రుచిగా ఉంటుందా.. అని విద్యార్థులను ఆయన ప్రశ్నించారు. కరోనా పట్ల భయం మాని చదువుపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. రానున్న రోజుల్లో శనివారం వరకు తరగతులు నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. మరోవైపు అక్షయ పాత్ర సంస్థ గురువారం మధ్యాహ్న భోజనాన్ని అందించే పనులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 789 పాఠశాలలకు చెందిన 75 వేల మంది విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. బెంగళూరు, రాజాజీనగర, వసంతనగర, జిగణిలోని అక్షయ పాత్ర వంటశాలల నుంచి బెంగళూరు, గ్రామీణ ప్రాంతాలకు ఈ సంస్థ ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. 18 నెలల తర్వాత ప్రారంభమైన పాఠశాలలకు ఇకపై విరామం లేకుండా భోజనం అందిస్తామని సంస్థ ప్రకటించింది.


వాహనం నుంచి దించుతున్న క్యారేజ్‌లు

డిమాండ్ల మాటేంటి?

దాదాపు 19 నెలల తర్వాత మళ్లీ పాఠశాలలు పూర్తి స్థాయిలో తెరుస్తున్నారు. పాఠాలు చెప్పే బోధన సిబ్బంది సమస్యలు మాత్రం దశాబ్దాల కాలంగా పరిష్కారానికి నోచుకోలేదన్న వాదన వినిపిస్తోంది. కోరుకున్న చోటికి బదిలీ, డిగ్రీ అర్హతలున్న వారికి పదోన్నతులు, ప్రధానోపాధ్యాయులకు వేతన సవరణ, నూతన ఫించను తొలగించి పాత సవరణ విధానం, గ్రామీణ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రత్యేక భత్యాలు, పీఈటీ ఉపాధ్యాయుల వేతన సవరణ తదితరాలు 20 ఏళ్లుగా పరిష్కారం కాలేదు. ఏటా సర్కారుకు తమ సమస్యలు విన్నవించినా ఫలితం లేకపోవటంతో ఈనెల 30 వరకు నల్లగుడ్డ ధరించి విధులకు హాజరవ్వాలని రాష్ట్ర ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం నిర్ణయించింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినా నవంబరు 10 వరకు విద్యార్థి ప్రగతి నివేదికను నమోదు చేయకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తారు.

అక్కడక్కడా అడ్డంకులు

గురువారం నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేయాలని సర్కారు ప్రకటించింది. సుదీర్ఘ కాలంగా బడులు మూసి వేయటంతో భోజనానికి అవసరమైన వస్తువులు నిండుకున్నాయి. వీటికి తోడు ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనానికి అవసరమైన సమాచారాన్ని విద్యాశాఖకు ఇవ్వకపోవటంతో గురువారం కొన్ని చోట్ల మాత్రమే మధ్యాహ్న భోజనాన్ని పంపిణీ చేశారు. అన్న దాసోహ ఖాతాల్లోనూ నిధులు లేకపోవటంతో నిత్యావసర వస్తువులు కొనుగోలు కుదరని వ్యవహారంగా మారింది. జిల్లా విద్యాశాఖ ఆదేశాలతో పాఠశాల పరిసరాల్లోని దుకాణాల్లో నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలని సూచించినా ఉపాధ్యాయులు అందుకు సిద్ధంగా లేకపోవటం గమనార్హం. 50 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలల్లో ఉపాధ్యాయులే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని సర్కారు సూచించింది. భోజనం అందివ్వలేని పాఠశాలలను మధ్యాహ్నం వరకే నిర్వహించాలని విద్యాశాఖ ప్రకటించింది.

మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న సిబ్బంది


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని