రాచనగరి.. జలమయం
eenadu telugu news
Published : 22/10/2021 00:54 IST

రాచనగరి.. జలమయం

విరిగిపడిన కొండ చరియలు


భారీ వర్షాలకు చిక్కమగళూరు శివార్లలో కొట్టుకుపోయిన వంతెన

మైసూరు, న్యూస్‌టుడే : రాచనగరి మైసూరు తడిసి ముద్దయింది. బుధవారం సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమైన వర్షం.. గురువారం ఉదయం వరకు నిరంతరాయంగా కురిసింది. నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం ఉదయం నుంచి మహానగర పాలికె సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో నీటిని తొలగించడంలో నిమగ్నమైంది. బుధవారం వాతావరణం పొడిగా ఉంటుందని అందరూ భావించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొడి వాతావరణమే కొనసాగింది. సంధ్యా సమయంలో విద్యుద్దీపకాంతుల్లో నగరాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. ప్యాలెస్‌, పరిసర ప్రాంతాలన్నీ సందర్శకులతో కిక్కిరిశాయి. సాయంత్రం ఏడు గంటలకు ఆరంభమైన జల్లులు కొద్దిసేపటికే జోరందుకున్నాయి. అప్పటి వరకు ప్యాలెస్‌ పరిసరాల్లో గడిపిన జనం చెల్లాచెదురయ్యారు. తలదాచుకునేందుకు పరుగులు తీశారు. గురువారం ఉదయం ఎనిమిది గంటల వరకు వర్షం కురుస్తూనే ఉంది. నగరంలో పది సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణశాఖ తెలిపింది.

l భారీ వర్షాలకు చాముండి కొండల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండల పైభాగం నుంచి నంది విగ్రహానికి చేరుకునే మార్గంలో పది అడుగుల పొడవునా ప్రధాన రహదారి కోసుకుపోయింది. అక్కడ కొండ చరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా రహదారిని మూసివేశారు. గతంలో కూడా ఈ ప్రాంతంలోనే కొండ చరియలు విరిగి పడినట్లు గుర్తించారు.

మండ్య, మైసూరులో హోరు

మండ్య, న్యూస్‌టుడే : నైరుతి రుతు పవనాలు విశ్రమించే సందర్భంలో తమ ప్రతాపాన్ని చూపుతాయంటారు. బుధవారం రాత్రి ఇదే వాస్తవ రూపం దాల్చింది. మండ్య, మైసూరు జిల్లాల్ని వర్షం ముంచెత్తినట్లు ప్రాంతీయ వాతావరణశాఖ తెలిపింది. మండ్య జిల్లా పాండవపురలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హొనకెరెలో 9, మండ్యలో 8, బిళహకెరె, నాగనహళ్లి 7, రాయల్పాడు 6, కోట, టిపటూరు, కె.ఆర్‌.పేట, శ్రీరంగపట్టణ, చిక్కమగళూరు, హారంగి, చింతామణి 5, మూడబిద్రి, విరాజ్‌పేట, మళవళ్లి, హాసన, సరగూరు 4 ఉడుపి, ధర్మస్థల, మాణి, శ్రీమంగల, సుంటికొప్ప, సోమవారపేట, పొన్నంపేట, శ్రీనివాసపుర, కళస, బాళెహొన్నూరు, కె.ఆర్‌.ఎస్‌., అరసికెరె, బేలూరు, సాలిగ్రామ 3, బంట్వాళ, కుక్కె, పుత్తూరు, విట్ల, ముల్కి, మంగళూరు, సవణూరు, హావేరి, పిరియాపట్టణ, జయపుర, తరీకెరె, బండీపుర, కోణనూరు, మడికెరి, మద్దూరు, కుశాలనగర, చిక్కజాల, రామనగరలో రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇతర అనేక ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు కురిశాయి. బెంగళూరులో గురువారం మధ్యాహ్నం జల్లులు కురిసినట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.

భారీ వర్షాలకు చాముండి కొండల్లో విరిగిపడిన కొండ దారి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని