ప్రచారంలో మాటల తూటాలు
eenadu telugu news
Published : 22/10/2021 00:54 IST

ప్రచారంలో మాటల తూటాలు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : ఉప ఎన్నికల ప్రచార జోరు పెరుగుతోంది. పార్టీల కీలక నేతలకు తోడుగా రెండో శ్రేణి నేతలు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇప్పటికే మూడు పార్టీల ప్రముఖులు.. బసవరాజ బొమ్మై, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌, కుమారస్వామి తదితరులు తమ వ్యాఖ్యలతో సరికొత్త రాజకీయానికి తెరలేపారు.

l గతంలో ఎన్నడూ లేనంతగా వ్యక్తిగత విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిరక్షరాస్యుడంటూ పీసీసీ సామాజిక మాధ్యమం చేసిన వ్యాఖ్యను పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో పాటు అధికార ప్రతినిధి లీలా బల్లాల్‌ తప్పుపట్టారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలను సామాజిక మాధ్యమం నుంచి తొలగించారు. ప్రధానిని విమర్శించిన కాంగ్రెస్‌పై భాజపా రాష్ట్రాధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్య మరింత రచ్చ చేసింది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని ఏకంగా మాదక ద్రవ్యాల బానిస అంటూ నళిన్‌ కుమార్‌ చేసిన విమర్శను మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తీవ్రంగా ఖండించారు. జేడీఎస్‌ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ ఎన్నికల సందర్భంగా వ్యక్తిగత విమర్శలతో రచ్చ చేస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌నే కాకుండా రహస్య పొత్తులున్నట్లు భావించే భాజపాను ఏమాత్రం విడిచిపెట్టకుండా విమర్శిస్తున్నారు. విపక్ష నేత స్థానంపై ఆయన చేసిన వ్యాఖ్యలను జేడీఎస్‌ సీనియర్లే ఖండించారు. పార్టీ సీనియర్‌ నేత వై.ఎస్‌.వి.దత్తా ఏకంగా కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో విలువను ప్రశ్నించేలా ఉన్నాయన్నారు. దేవేగౌడతో పాటు కుమారస్వామి కూడా సుదీర్ఘకాలం పాటు విపక్ష స్థానాన్ని అలంకరించటాన్ని ఆయన గుర్తు చేశారు.

l ఎన్నికల సందర్భంగా భాజపా నగదు పంపిణీ చేస్తుందన్న విపక్ష నేత సిద్ధరామయ్య ఆరోపణలను ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తీవ్రంగా ఖండించారు. హానగల్‌లో ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండగా వచ్చిన ఉప ఎన్నికల్లో నగదు పంచిన అనుభవంతోనే మమ్మల్ని విమర్శిస్తున్నారని సమాధానమిచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని