చిక్కడు...దొరకడు..!
eenadu telugu news
Published : 22/10/2021 00:54 IST

చిక్కడు...దొరకడు..!


గవియప్ప తండ్రి రంగనగౌడతో ముచ్చటిస్తున్న మంత్రి ఆనంద్‌సింగ్‌

హొసపేటె, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి తనపై అలిగిన మాజీ ఎమ్మెల్యే హెచ్‌.ఆర్‌.గవియప్పతో స్నేహం చేసేందుకు మంత్రి ఆనంద్‌సింగ్‌ చేయని ప్రయత్నాలంటూ లేవు. ఆయన్ను మెప్పించి మళ్లీ భాజపాలోకి తీసుకురావాలని మంత్రి తహతహలాడుతున్నారు. బుధవారం సమాచారం ఇవ్వకుండా నెహ్రూ కాలనీలోని గవియప్ప ఇంటికి ఆనంద్‌సింగ్‌ వెళ్లారు. ఆ సమయంలో గవియప్ప ఇంట్లో లేరు. ఆయన తండ్రి రంగనగౌడతో కొంతసేపు మాట్లాడి ఆనంద్‌సింగ్‌ వెనుదిరిగారు. హొసపేటెలో సుమారు 30 ఏళ్లపాటు గవియప్ప కాంగ్రెస్‌లో క్రియాశీల పాత్ర పోషించారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించినా దక్కకపోవడంతో స్వతంత్రుడిగా పోటీ చేసి నెగ్గారు. ఆ సమయంలో కంప్లి కూడా హొసపేటె విధానసభ నియోజకవర్గ పరిధిలో ఉండేది. 2008లో ఆయనకే హొసపేటె కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కినా ఆనంద్‌సింగ్‌ చేతిలో ఓడిపోయారు. 2013లో మరోసారి టికెట్‌ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్‌ నాయకుడు అబ్దుల్‌ వహాబ్‌కు టికెట్‌ ఇచ్చినా ఆనంద్‌సింగ్‌ ధాటికి నిలబడలేకపోయారు. 2018లో తప్పనిసరిగా టిక్కెట్‌ ఇస్తామని గవియప్పకు కాంగ్రెస్‌ నాయకులు హామీ ఇచ్చారు. అదే సమయంలో భాజపాకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ టిక్కెట్‌ను ఆనంద్‌సింగ్‌ను చేజిక్కించుకున్నారు. తీవ్ర ఆవేదనకు గురైన గవియప్ప భాజపాలో చేరి ఆనంద్‌సింగ్‌కు గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు. 2019లో జరిగిన హొసపేటె ఉప ఎన్నికల్లో గవియప్పకు మళ్లీ నిరాశే ఎదురైంది. అప్పటి నుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మండలి అధ్యక్ష పదవిని తోసిపుచ్చారు. మంత్రి ఆనంద్‌సింగ్‌, మాజీ ఎమ్మెల్యే గవియప్ప మిత్రులైనప్పటికీ రాజకీయాలు వారిని దూరం చేశాయి. రెండేళ్ల నుంచి గవియప్పను కలవాలని ఆనంద్‌సింగ్‌ చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. నగరసభ ఎన్నికలు ఎదుర్కోవాలంటే గవియప్పను ప్రసన్నం చేసుకోవడం చాలా అవసరమని ఆనంద్‌సింగ్‌ భావిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని