మేడం ప్లీజ్‌.. మాకు వధువులను వెతికిపెట్టండి!
eenadu telugu news
Updated : 22/10/2021 07:57 IST

మేడం ప్లీజ్‌.. మాకు వధువులను వెతికిపెట్టండి!


వధువులను వెతికి పెట్టాలని అధికారులకు విన్నవిస్తున్న యువకులు

పెళ్లంటే అనిర్వచనీయమైన అనుభూతి.. ఓ జంట జీవితంలో మధుర జ్ఞాపకం.. ఈడొచ్చిన ప్రతి యువతీ, యువకులు అలాంటి శుభ ఘడియలు రావాలని ఆరాటపడుతుంటారు.. పచ్చ తోరణాలు, ఇంటి నిండా బంధుగణం, బాజాభజంత్రీలు, మంగళకరమైన వాతావరణం చూస్తే ఎవరికైనా మనసు ఆనంద డోలికల్లో తేలియాడాల్సిందే.. మారిన ఆధునిక పోకడలు కొందరు బ్రహ్మచారులకు శుభలేఖలు రాసుకునే అదృష్టం కలగడం లేదు.. పెరుగుతున్న వయోభారం వారిని మరింత కుంగదీస్తోంది.. ఆడపిల్లల తల్లిదండ్రులు ఏదోక ‘కొలువుంటేనే’ పిల్లనిస్తామంటూ వెనకడుగు వేస్తున్నారు. ఏకంగా తమకు వధువులను వెతికి పెట్టాలంటూ కొందరు యువత తహసీల్దారుకు వినతిపత్రాలు సమర్పించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

తుమకూరు, న్యూస్‌టుడే : కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో చాలామంది యువకులకు వివాహ యోగం కలగడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం, స్త్రీ,పురుష నిష్పత్తిలో తేడా ఎక్కువగా ఉండటం, కొలువు ఉంటే భద్రత ఉంటుందనే రక్షణాత్మక ధోరణి ఆడపిల్లల తల్లిదండ్రుల్లో పెరగడం వంటి అంశాలు ప్రతి గ్రామంలోను ఈడొచ్చిన యువకులకు శాపంగా మారాయి. ప్రముఖంగా వ్యవసాయ కుటుంబాలకు చెందిన యువకులకు పెళ్లీడు వయస్సు దాటినా కల్యాణయోగం కలగడంలేదు. వ్యవసాయం చేసే యువకులకు ఆడపిల్లలను ఇవ్వడానికి వారి తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. గార్మెంట్స్‌లో పనులు చేస్తున్న యువకులకు పిల్లను ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. వధువులు లభ్యంకాక జిల్లాలోని చిక్కనాయకనహళ్ళి తాలూకా వ్యవసాయ యువకులు దూరప్రాంతమైన ఉత్తర కర్ణాటకకు చెందిన యువతులను పరిణయం ఆడేందుకు మొగ్గు చూపుతున్నారు.

తహసీల్దారుగారూ..దయచేసి..

పెళ్లి కుమార్తెలు లభ్యంకాకపోవడాన్ని ప్రముఖమైన సమస్యగా పరిగణించాలని, ఇలాంటి క్లిష్ట సమస్యకు పరిష్కారాలు కనుగొనాలని పలువురు యువకులు తహసీల్దారుకు మొరపెట్టుకోవడం గమనార్హం. చిక్కనాయకనహళ్లి తాలూకా లక్కగొండనహళ్లి గ్రామంలో తహసీల్దారు తేజస్విని నేతృత్వంలో జరిగిన జనస్పందన కార్యక్రమంలో లక్కగొండనహళ్లి , తిపటూరు తాలూకా తిమ్మాపుర గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబాలకు చెందిన 15 మంది యువకులు తమకు వివాహాలు చేసుకోవడానికి వధువులను వెతికివ్వండి అంటూ ఏకంగా అర్జీలు సమర్పించారు. ఇదివరకే తుమకూరు జిల్లాధికారికి సైతం తాము లేఖను సైతం రాసినట్లు గుర్తు చేయడం విశేషం.

చివరికిలా జరిగింది..

వధువు కోసం తిరిగితిరిగి విసిగిపోయి వివాహభాగ్యం లేదని నిరాశ చెందిన 45 ఏళ్ల వ్యక్తి 25 సంవత్సరాల యువతిని వివాహమాడటం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తుమకూరు జిల్లాలోని కుణిగల్‌ తాలూకా చౌడనకుప్పే గ్రామం సమీపంలోని అక్కిమరిపాళ్య గ్రామానికి చెందిన శంకర్‌(45), సంతేమావత్తూరు గ్రామానికి చెందిన మేఘనా(25) పరస్పర అంగీకారంతో వివాహం చేసుకోగలిగారు. వధువుకు ఇదివరకే వివాహమై భర్త రెండేళ్ల కిందట వేరయ్యారు. శంకర్‌కు ఇప్పటికీ వివాహం కాలేదు. ఈ నేపథ్యంలో పరస్పర అంగీకారంతో గ్రామంలోని దేవాలయం వద్ద గ్రామ ప్రజలు, బంధువుల సమక్షంలో ఈ జంట వివాహంతో ఒక్కటైంది. వ్యవసాయం, ఇతర పనులు చేసే గ్రామీణ యువతకు వివాహం కావడమనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఉన్నతాధికారులు, ప్రభుత్వం జోక్యం చేసుకుని చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని