జనరక్షణకే అగ్రపీఠం
eenadu telugu news
Published : 22/10/2021 01:00 IST

జనరక్షణకే అగ్రపీఠం


బెంగళూరులో నిర్వహించిన పోలీస్‌ సంస్మరణ కార్యక్రమంలో ఓ ఘట్టం

హుబ్బళ్లి, న్యూస్‌టుడే : పోలీసులు ప్రజలతో స్నేహభావంతో మెలగాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. ‘ప్రజలకు న్యాయాన్ని సమకూర్చే వ్యవస్థగా మన్ననల్ని పొందాలి. యువతులకు తగిన రక్షణనిచ్చేందుకు ప్రతీ కళాశాలలో మహిళా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. అన్ని రంగాల్లో కూడా పోలీసుల అవసరం ఎంతో ఉంది. వారికి మనం తగిన సహకారం, ప్రోత్సాహం అందివ్వాలి’ అని అభిప్రాయపడ్డారు. హుబ్బళ్లి సీఏఆర్‌ మైదానంలో గురువారం నిర్వహించిన పోలీసు అమరవీరుల స్మరణోత్సవంలో భాగంగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. సమాజంలో శాంతి భద్రతల పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అనేక దేశాల్లో అంతర్గత కలహాలు, తీవ్రవాదం వల్ల ప్రగతి లోపించిన విషయాన్ని గుర్తుచేశారు. పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కొత్తగా 16 వేల పోలీసుల నియామకానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌ గేమ్‌ల వల్ల యువత పెడదోవ పడుతోందని విచారం వ్యక్తం చేశారు. దీన్ని అరికట్టేందుకు చట్టంలో మార్పులు తీసుకురావడం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మార్పులు చేసేందుకు అనేక అడ్డంకులు ఎదురైనా వాటిని లెక్కచేయకుండా కఠిన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని