విస్తరణపై బొమ్మై దృష్టి
eenadu telugu news
Published : 23/10/2021 01:19 IST

విస్తరణపై బొమ్మై దృష్టి

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మరోమారు దిల్లీ బాటపట్టనున్నారు. గురువారమే ఆయన దిల్లీకి వెళ్లాల్సి ఉన్నా అనివార్య కారణాలతో ఆది, లేదా సోమవారాల్లో ఆయన దిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటికే నాలుగుసార్లు దిల్లీకి వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి శాఖలకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించారు. ఈసారి మలివిడత మంత్రివర్గ విస్తరణపై చర్చిస్తారని సమాచారం. ఈనెల తొలివారంలో దిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాతో సమావేశం కాలేకపోవటంతో మంత్రివర్గ విస్తరణపై చర్చించలేదు. ఈసారి తప్పనిసరిగా నడ్డాతో చర్చించి మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలున్నాయి. వీటితో పాటు బెంగళూరు నగర బాధ్య మంత్రి ఎంపిక ప్రక్రియపైనా ముఖ్యమంత్రి స్పష్టత పొందనున్నారు.

l ముఖ్యమంత్రి దిల్లీకి వెళ్తారన్న సమాచారం అందుకున్న పలువురు ఆశావహులు ఆయన నివాసం చుట్టూ పచార్లు చేస్తున్నారు. సీడీ కేసులో నిలువునా మునిగిన మాజీ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి ఇప్పటికే ఆర్‌టీ నగరలోని బొమ్మై నివాసానికి పదేపదే వచ్చి వెళుతున్నారు. తనను ఈ కేసు నుంచి తప్పించి ఎట్టకేలకు మంత్రివర్గంలో చేర్పించుకోవాలని విన్నవించారని సమాచారం. ఇంకా ఏడాది సమయం మిగిలి ఉండటంతో ఆలోగా మంత్రివర్గంలో చేరితేనే రానున్న ఎన్నికలకు రమేశ్‌ జార్ఖిహొళి సిద్ధం కాగలరు. మంత్రివర్గంలో చోటు దక్కకపోతే తన రాజకీయ భవిష్యత్తు మరింత డోలాయమానంలో పడుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆయనతో పాటు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తిప్పారెడ్డి, యువ ఎమ్మెల్యేలు రాజుగౌడ, పూర్ణిమా శ్రీనివాస్‌, శివనగౌడ నాయక్‌, అరవింద్‌ బెల్లద్‌, ఎన్‌.మహేశ్‌, రామదాస్‌, దత్తాత్రేయ పాటిల్‌, బసవనగౌడ యత్నాళ్‌ కూడా మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నాలుగు స్థానాలే ఉన్నా మంత్రివర్గ ప్రక్షాళన చేసైనా కొత్త ముఖాలకు చోటు కల్పించాలని బొమ్మై యత్నిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని